సినీజోష్‌ రివ్యూ: కనుపాప

Sat 04th Feb 2017 07:15 AM
సినీజోష్‌ రివ్యూ: కనుపాప

ఆశిర్వాద్‌ సినిమాస్‌ 

కనుపాప 

తారాగణం: మోహన్‌లాల్‌, నెడుముడి వేణు, బేబీ మీనాక్షీ, విమలా రామన్‌, సముద్రఖని తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎన్‌.కె.ఏకాంబరం 

సంగీతం: 4 మ్యూజిక్స్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: రాన్‌ యెథన్‌ యోహాన్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఎస్‌.అయ్యప్పన్‌ నాయర్‌ 

కథ: గోవింద్‌ నాయర్‌ 

మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి 

సమర్పణ: దిలీప్‌కుమార్‌ బొలుగోటి 

నిర్మాత: మోహన్‌లాల్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రియదర్శన్‌ 

విడుదల తేదీ: 03.02.2017 

ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని మలయాళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మోహన్‌లాల్‌ ఇటీవల జనతా గ్యారేజ్‌, మనమంతా, మన్యంపులి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు కనుపాప చిత్రంలో తన నటనతో మరోసారి అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మోహన్‌లాల్‌తో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను చేసిన ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మలయాళంలో ఒప్పం పేరుతో రూపొంది కనుపాపగా తెలుగులో ఈరోజు విడుదలైంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన కనుపాప ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? ఏ మేర థ్రిల్‌ చేసింది? తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

అతని పేరు జయరామ్‌(మోహన్‌లాల్‌). పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోయినా అతనిలో కొన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ వున్నాయి. అలికిడిని బట్టి, వాసనను బట్టి తన చుట్టూ ఎవరు వున్నారో కనిపెట్టగలడు. అతను ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. సుప్రీమ్‌ కోర్ట్‌ న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్‌ అయిన కృష్ణమూర్తి(నెడుముడి వేణు)కి జయరామ్‌ ఎంతో సన్నిహితుడు. గతంలో వాసుదేవ్‌(సముద్రఖని) అనే వ్యక్తి చేసిన ఓ నేరానికి జీవితఖైదు విధిస్తాడు కృష్ణమూర్తి. వాసు నిరపరాధి కావడంతో ఇది తెలుసుకున్న వాసు కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో కృష్ణమూర్తిపై పగ పెంచుకుంటాడు వాసు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనకి శిక్ష పడటానికి కారకులైన ఒక్కొక్కరినీ చాలా తెలివిగా చంపుతుంటాడు. ఇప్పుడు అతని టార్గెట్‌ కృష్ణమూర్తి, ఊటీలో చదువుకుంటున్న అతని కూతురు నందిని(బేబీ మీనాక్షి). వాసు తనని చంపడానికి వస్తాడని తెలుసుకున్న కృష్ణమూర్తి ఈ నిజాన్ని జయరామ్‌కి చెప్పి, నందినిని రక్షించే బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. అనుకున్నట్టుగానే కృష్ణమూర్తిని హత్య చేస్తాడు వాసు. అంధుడైనప్పటికీ జయరామ్‌ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పటి నుంచి వాసు తన దగ్గరగా వచ్చినపుడు జయరామ్‌ పసిగడుతుంటాడు. జయరామ్‌ ద్వారా నందిని ఎక్కడ వుందనేది తెలుసుకొని ఆమెను కూడా చంపాలని అతన్ని వెంబడిస్తుంటాడు వాసు. మరి వాసు బారి నుంచి నందినిని జయరామ్‌ కాపాడగలిగాడా? వాసుని పోలీసులకు పట్టించగలిగాడా? జస్టిస్‌ కృష్ణమూర్తి హత్య వల్ల జయరామ్‌కి ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలు సినిమాలు చూసి తెలుసుకోవాల్సిందే. 

తన సహజమైన నటనతో ఆకట్టుకునే మోహన్‌లాల్‌ మరోసారి తన నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. హీరోగా తన ఇమేజ్‌ని పక్కన పెట్టి ఒక అంధుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కృష్ణమూర్తిగా నెడుముడి వేణు చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. నందినిగా మీనాక్షి మంచి అభినయాన్ని ప్రదర్శించింది. కిల్లర్‌ వాసుదేవ్‌గా సముద్రఖని మరో అద్భుతమైన పాత్ర పోషించాడు. కేవలం తన లుక్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఔట్‌పుట్‌ని ఇవ్వగలిగాడు. పనిమనిషిగా విమలా రామన్‌ ఓ సాధారణ పాత్ర చేసింది. ఇక సినిమాలోని నటించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే మొదట ఎన్‌.కె.ఏకాంబరం ఫోటోగ్రఫీ గురించి చెప్పాలి. చాలా నేచురల్‌ ఫోటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అందంగా చూపించాడు. ఈ చిత్రానికి 4 మ్యూజిక్స్‌ అందించిన పాటలన్నీ బాగున్నాయి. ప్రతి పాట అర్థవంతంగా, అందరికీ అర్థమయ్యేలా వున్నాయి. విజువల్‌గా కూడా పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చేసిన రాన్‌ యెథన్‌ యోహాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల ప్రతి సీన్‌ బాగా ఎలివేట్‌ అయ్యింది. రాజశేఖరరెడ్డి రాసిన మాటలు బాగున్నాయి. డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ గురించి చెప్పాలంటే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా మలయాళంలో అతనికి ఎంతో మంచి పేరు తెచ్చింది. నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. కొత్త తరహా చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చే అవకాశం వుంది. సినిమా స్టార్ట్‌ అయిన క్షణం నుంచి క్లైమాక్స్‌ వరకు ప్రతి సీన్‌ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతూ వస్తుంది. ప్రియదర్శన్‌ కథను నడిపిన విధానం, మెయిన్‌టెయిన్‌ చేసిన సస్పెన్స్‌ ఆకట్టుకుంటుంది. దానికి తగ్గట్టుగా మోహన్‌లాల్‌ అద్భుతమైన నటన, అందమైన విజువల్స్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి సంబంధించి కథ, కథనాల పరంగా, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ పరంగా, సాంకేతికంగా ఎన్నో ప్లస్‌ పాయింట్స్‌ వున్నప్పటికీ దానికి తగ్గట్టుగానే మైనస్‌ పాయింట్స్‌ కూడా వున్నాయి. తెలుగు నేటివిటి కాకపోవడం, స్లో నేరేషన్‌, డబ్బింగ్‌లో క్వాలిటీ లేకపోవడం, ఫస్ట్‌ హాఫ్‌లో త్వరగా కథలోకి వెళ్ళకపోవడం వంటి విషయాలు సినిమాకి మైనస్‌లుగా మారాయి. మలయాళంలో మోహన్‌లాల్‌కి వున్న ఫాలోయింగ్‌, స్టార్‌ ఇమేజ్‌ వల్ల ఒప్పం చిత్రం భారీ కలెక్షన్లు సాధించగలిగింది. ఈమధ్యకాలంలో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న మోహన్‌లాల్‌ కనుపాపతో వారికి మరింత చేరువ అవుతాడనడంలో సందేహం లేదు. మలయాళంలో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌లాల్‌... దిలీప్‌కుమార్‌ బొలుగోటి సహకారంతో తెలుగు వెర్షన్‌ని కూడా తనే రిలీజ్‌ చెయ్యడం విశేషం. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు, క్రైమ్‌ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి కనుపాప ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: మెస్మరైజింగ్‌ థ్రిల్లర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017