సినీజోష్ రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

Fri 13th Jan 2017 02:25 PM
gautamiputra satakarni,gautamiputra satakarni movie review,balakrishna gautamiputra satakarni review,krish,shriya,hemamalini  సినీజోష్ రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి
సినీజోష్ రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

సమీక్ష: గౌతమిపుత్ర శాతకర్ణి 

బ్యానర్‌: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

తారాగణం: బాలకృష్ణ, శ్రియా, హేమ మాలిని, కబీర్‌ బేడి, శివ రాజ్‌కుమార్‌, తనికెళ్ళ, శుభలేఖ సుధాకర్   తదితరులు

మాటలు: సాయి మాధవ్‌ బుర్రా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

కళ: భూపేష్‌ ఆర్‌ భూపతి

కూర్పు: రామకృష్ణ ఆర్రం

సంగీతం: చిరంతన్‌ భట్‌

ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌

నిర్మాతలు: రాజీవ్‌ రెడ్డి, బిబో శ్రీనివాస్‌, సాయిబాబు

రచన, దర్శకత్వం: క్రిష్‌

విడుదల తేదీ: జనవరి 12, 2017 

సంక్రాతి బరిలో నువ్వా నేనా అన్నట్లుగా చిరంజీవి ఖైదీతో వస్తే బాలకృష్ణ తనకే సాధ్యమైన చారిత్రక నేపథ్యం ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణితో బరిలో దిగారు. తెలుగు సినిమాను ఫాలో అయే ప్రతి ప్రేక్షకుడికి  దర్శకుడు క్రిష్ అభిరుచి పట్ల అమితమైన మర్యాద ఉంటుంది. ఎందుకంటే గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె లాంటి వైవిధ్యమైన చిత్రాలకు అతను పెట్టింది పేరు. ఈసారి వంతు బాలకృష్ణతో అదీ ఓ అలుపెరగని పోరాట యోధుడు, అఖండ భారతావనిని ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చిన మొట్టమొదటి భారతీయుడు, అదీ మన తెలుగు వాడైన గౌతమిపుత్ర శాతకర్ణి కథ కావడంతో అందరిలో సినిమాను ఎప్పుడెప్పుడు చూసేస్తామా అన్న తపన నెలకొంది. మరేందుకు చూసేద్దాం పదండి.

టైం స్కెల్ సూచనప్రాయంగా ఇదీ అని మెన్షన్ చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి కథ మొదలవుతుంది. తల్లి గౌతమి బాలా శ్రీ (హేమ మాలిని) ఆలనా పాలనలో ఎదిగిన గౌతమిపుత్ర శాతకర్ణి అవిక్రమ పరాక్రముడిగా యుద్దాలలో మునిగితేలుతూ సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు. అతని కోరికల్లా ఒకటే, ముక్కలు చెక్కలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాల కోసం ఎప్పుడూ యుద్దాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న రాజులందరిని సామంతులుగా చేసేసి జంబూద్వీపాన్ని ఒకటిగా పాలించి ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని. అందుకోసం భార్య వశిష్టి దేవి (శ్రియ), ఇద్దరు పిల్లలకు సమయం కూడా సరిగ్గా కేటాయించలేని పరిస్థితిలో అంటాడు. మొదట మరాఠా రాజ్యాన్ని గెలవడంతో మొదలయిన చిత్ర కథ, అటు తరువాత సౌరాష్ట్ర రాజు నహాపనుడు(కబీర్ బేడీ)ని జయించడంతో యావత్ భరత ఖండం శాతవాహనుల గుప్పిట్లోకి వచ్చేస్తోంది. ఇంతలోనే పరాయి దేశస్థుడైన గ్రీక్ చక్రవర్తి డిమిత్రియస్ రూపంలో మరోసారి దేశానికి ఆపద వఛ్చి పడుతుంది. మరి శాతకర్ణి ప్రభువుల వారి కరవాలం ముందు గ్రీక్ వారు ఎలా మట్టికరిసారు అని ఇంకో యుద్ధం దృశ్యరూపంలో చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

దర్శకుడిగా క్రిష్ ఎంతటి విషయం పరిజ్ఞానపరుడో తెలియనిది కాదు. కథలు పట్టుకోవడంలో, కథనాలను పెనవేసుకుపోవడంలో ఇతని దిట్టతనం మరోసారి శాతకర్ణిలో ప్రస్ఫూటంగా అగుపిస్తుంది. చారిత్రక కథతో పాటు సంపూర్ణమైన మాస్ హీరోఇజం దట్టించిన సన్నివేశాలను కేవలం బాలకృష్ణ కోసమే రాసుకున్నాడా అనే స్థాయిలో ప్రెజెంట్ చేసాడు. సినిమా సాంతం బాలయ్య పాత్ర చుట్టూరానే తిరిగేలా కథనం రాసుకోవడంతో చరిత్రలో మిగిలిన అంశాలు ఏవీ పైకి తేలినట్టుగా అనిపించవు, అసలు ఆ అంశాలు కథలోనే కనిపించకుండా పోయే ప్రమాదం సైతం ఏర్పడింది. 

యుద్ధం తరువాత ఇంకో యుద్ధం, మళ్ళీ ఆ తరువాత ఇంకో యుద్ధం, ఇలా అంతటా యుధ్ధమే కమ్మేయడంతో శాతకర్ణి కేవలం యుద్ధాలే తప్ప ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాడు అన్న అంశం తెర మీదకు రాలేదు. కేవలం రాజసూయ యాగం సమయంలో ప్రపంచీకరణకు చెందిన మూడు నాలుగు పంక్తులతో పురాతన కాలంలోనే ఇలాంటి ఓ ప్రక్రియకు బీజం పడిందన్న ఆలోచన రేకెత్తించాడు. అలాగే బౌద్ధం గూర్చి రెండు దృశ్యాల్లో చెప్పారు తప్ప మిగతా మతాల పట్ల, పరిపాలన ధోరణుల మీద, అప్పటి వాణిజ్య పద్దతులు లాంటి అంశాల మీద డాక్యుమెంటరీ ఛాయలు రాకుండా మరికాసింత జ్ఞ్యానం తెలుగు ప్రజలకు వదలాల్సింది లేదా వాటికి కథనంతోనే ముడి వేసేస్తే క్రిష్ మార్క్ ట్రీట్మెంట్ మరింత స్పష్టంగా కనిపించేది. 

కథ ఏదైనా బాలకృష్ణ లాంటి హీరో నుండి ఎటువంటి మాస్ అంశాలు ఆశిస్తామో అవన్నీ మాత్రం శాతకర్ణిలో ఎక్కువగా సాయి మాధవ్ బుర్ర సంభాషణల్లో అభిమానులు ఉబ్బితబ్బిబ్బు అయ్యేలా జోడించారు. ఒకటా రెండా... సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అంటూ పంపే దూత సందేశం నుండి ఇది నేను గెలిచిన తల, దించకు అని మరాఠా రాజుని ఉద్దేశిస్తూ విసిరిన రాజసం నుండి భార్య ముందర స్త్రీల ఔన్నత్యాన్ని వివరించే సంభాషణ నుండి అథములం కాదు ప్రథములం అని తెలుగుజాతి ప్రాముఖ్యతను ఒడిసిపట్టిన దృశ్యం నుండి ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధం తక్క మిగిలిన చిత్రంలో ప్రతి రెండు నిమిషాలకి ఓ పంచ్ పడుతూ అభిమానులను జోరెత్తిస్తూనే ఉంది. కేవలం హీరోఇజం మాత్రమే కాకుండా ఆనాటి శాతకర్ణి అసలు సంకల్పం గూర్చి చివరలో చెప్పిన డైలాగ్ చప్పట్లు కొట్టిస్తుంది. చిరంతన్ భట్ పాటల బాణీలు, చిత్రీకరణ బాగున్నాయి. సిరివెన్నెల వారి సాహిత్యానికి రాళ్లు కూడా కరగాల్సిందే. జ్ఞాన శేఖర్ కెమెరా పనితనం సైతం అద్భుతం. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణ విలువలు అమోఘం అని చెప్పక తప్పదు.

శాతకర్ణి పాత్రలో బాలయ్యను తప్ప ఇంకెవరినీ ఊహించుకోవడం ఎంత కష్టమో శ్రియను తప్ప మరో హీరోయిన్ ఎవరినీ వశిష్టి దేవిగా ఆలోచించడం కూడా తప్పే అవుతుంది. అంత అద్భుతంగా ఉంది ఆమె నటన. ముఖ్యంగా భర్తను రణభూమికి పంపే సెకండ్ హాఫ్ ఎపిసోడ్ ట్రీట్ చేసిన విధానం కంటతడి పెట్టిస్తుంది. హేమమాలినిలో రాజమాత గాంభీర్యం ఉట్టి పడింది. మిలింద్ గుణాజీ, కబీర్ బేడీలలో మరిన్ని ప్రతినాయక ఛాయలు దొర్లితే వార్ సీన్స్ ఎఫెక్ట్ మరింత పీక్స్ ఉండేది. శుభలేఖ సుధాకర్, శివకృష్ణ, తనికెళ్ళ తదితరులు తమ సీనియారిటీతో మెప్పించారు.

రెగ్యులర్ సినిమాలు, ముతక దృశ్యాలతో విసుగెత్తి ఉన్న ప్రేక్షకులకి క్రిష్ అందించిన కొత్త చారిత్రక అనుభూతి గౌతమీపుత్ర శాతకర్ణి. తనకున్న అన్ని పరిధుల దృష్ట్యా క్రిష్ క్వాలిటీ ప్రోడక్ట్ అందించాడు. కానీ అతని గత చిత్రాలతో అసలు క్యాలిబర్ తెలిసిన సమీక్షకుడిగా ఆలోచిస్తే గౌతమీపుత్ర శాతకర్ణిని తెలుగు సినీ చరిత్రలో ఓ దానవీరశూరకర్ణలా నిలిచిపోయేలా మలచదగ్గ ముడిసరుకు ఉన్న కథని సగం వరకే వాడి క్రిష్ తనను తానే అద్భుత అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడా అన్న సంశయం కూడా రాకమానదు. 

సినీజోష్ పంచ్: చారిత్రక కథా అంశాలను చూసే లెక్కలేసుకొని ఆమడ దూరం పారిపోయే నిర్మాతలు, మనకు చరిత్ర అంటూ ఒకటుందని కూడా తెలియని చీకట్లో మగ్గే కథకులు, దర్శకులున్న ఇటువంటి పరిశ్రమలో శాతకర్ణితో క్రిష్ చేసిన సాహసం నిజంగా నవ సినీశకానికి ఆరంభం కావాలి. ఇకనైనా రొట్ట కథలని, పరమ రొటీన్ సీన్లను వదిలి చరిత్ర పుస్తాకాలను దులిపి మరిచిపోయిన, మరుగయిపోతున్న తెలుగు జాతి మనుగడలో నుండే ఊడ్చేసిన మహానుభావుల కథలని చిత్రాలుగా మార్చితే రేపు సీడీలుగానో, యూ ట్యూబులోనో చూసుకుని మన భావితరాలు కనిష్టాన వారి పేర్లనైనా నెమరేసుకుంటే  క్రిష్ ఫలితానికి వంద రేట్లు ఫలితం దక్కినట్లవుతుంది.

సినీజోష్ రేటింగ్: 3/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017