సినీజోష్‌ రివ్యూ: వంగవీటి

Fri 23rd Dec 2016 07:37 PM
telugu movie vangaveeti,vangaveeti movie review,vangaveeti review in cinejosh,vangaveeti cinejosh review,ramgopal varma latest movie vangaveeti  సినీజోష్‌ రివ్యూ: వంగవీటి
సినీజోష్‌ రివ్యూ: వంగవీటి

రామదూత క్రియేషన్స్‌ 

వంగవీటి 

తారాగణం: సందీప్‌ కుమార్‌, వంశీ నెక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలి, 

కౌటిల్య, శ్రీతేజ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, కె.దిలీప్‌వర్మ, సూర్య చౌదరి 

సంగీతం: రవిశంకర్‌ 

ఎడిటింగ్‌: సిద్థార్థ రాతోలు 

మాటలు: చైతన్యప్రసాద్‌, రాధాకృష్ణ 

నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌ 

రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ 

విడుదల తేదీ: 23.12.2016 

విజయవాడలో ఒకప్పుడు రౌడీయిజం రాజ్యమేలింది. ఆధిపత్యం కోసం అలజడులు సృష్టించారు కొంతమంది. వారిలో చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా, వంగవీటి మోహనరంగా, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, దేవినేని మురళి ముఖ్యమైన వారు. ఈ గ్రూపు కక్షలు ఒక ప్రాంతానికే చెందినవి అయినా ఆంధ్రప్రదేశ్‌ అంతటా సంచలనం సృష్టించాయి. తన సినిమాలతో సంచలనం సృష్టించడానికి ఎక్కువ మక్కువ చూపే రామ్‌గోపాల్‌వర్మ ఈసారి వంగవీటి మోహనరంగా జీవితకథను ఆధారం చేసుకొని సినిమా చేశాడు. వంగవీటి.. కాపు కాసే శక్తి అంటూ డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమాను స్టార్ట్‌ చేసి మరో సంచలనానికి తెరతీశారు. గతంలో రక్తచరిత్ర, కిల్లింగ్‌ వీరప్పన్‌ వంటి రియలిస్టిక్‌ మూవీస్‌ని రూపొందించిన వర్మ వంగవీటి చిత్రాన్ని ఎంతవరకు రియలిస్టిక్‌గా తియ్యగలిగాడు? ఇలాంటి సెన్సిటివ్‌ ఇష్యూతో వర్మ తీసిన వంగవీటి చిత్రాన్ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? ఈ సినిమా ద్వారా వర్మ చెప్పాలనుకున్నదేమిటి? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఇది ఫిక్షన్‌ కథ కాదు. యదార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా. కాబట్టి కథ కంటే జరిగిన సంఘటనలకే ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది. వాస్తవంగా ఏం జరిగింది? సినిమాలో ఏం చూపించారు? ఎలా చూపించారు? అనే దానిపైనే ప్రేక్షకుల ఆసక్తి వుంటుంది. విజయవాడలో కొన్ని సంవత్సరాల పాటు జరిగిన మారణ హోమం గురించి తెలిసిన ఎంతో మందికి ఈ సినిమా రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవ సంఘనటనల్ని కూడా వర్మ సరిగ్గా చూపించలేకపోయాడు అని కొంత మంది అభిప్రాయం. బస్టాండ్‌ రాధాగా వంగవీటి రాధ జీవితం ఎలా ప్రారంభమైంది? చలసాని వెంకటరత్నం అండతో అతను ఎలా ఎదిగాడు? చివరికి తనకు అడ్డుగా వున్నాడని చలసానిని ఎలా చంపించాడు? ఆ తర్వాత రాధ ఎలా హత్య చెయ్యబడ్డాడు? రాధ ప్లేస్‌లోకి వచ్చిన తమ్ముడు రంగా తమ ఆధిపత్యాన్ని ఎలా కొనసాగించాడు? తన సహచరులైన గాంధీ, నెహ్రూ, మురళిలతో రంగాకి ఎందుకు విభేదాలు వచ్చాయి? దానివల్ల ఎలాంటి రంగా జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? చివరికి రంగా ఎలా హత్య చేయబడ్డాడు? అనేది కథ. 

రాధాగా, రంగాగా రెండు పాత్రలు పోషించాడు సాండీ (సందీప్‌ కుమార్‌). రెండు క్యారెక్టర్లకు లుక్‌ పరంగా వేరియేషన్స్‌ చూపించారు. వర్మ సూచనల మేరకు తన పరిధిలో ఆ రెండు క్యారెక్టర్లకు న్యాయం చేశాడు సాండీ. రంగా భార్యగా నైనా గంగూలి వున్నంతలో ఫర్వాలేదు అనిపించింది. దేవినేని ఫ్యామిలీకి చెందిన మురళి క్యారెక్టర్‌ చేసిన వంశీ సెకండాఫ్‌లో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో రంగా క్యారెక్టర్‌ కంటే మురళీ క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇచ్చినట్టు కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే వంశీ మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇక మిగతా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు ఎవరూ ప్రేక్షకులకు పరిచయం లేనివారు. వారి క్యారెక్టర్ల లిమిట్స్‌ మేరకు ఓకే అనిపించారు. 

సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. రాహుల్‌ శ్రీవాత్సవ్‌, కె.దిలీప్‌వర్మ, సూర్య చౌదరి చేసిన కెమెరా వర్క్‌ బాగుంది. అయితే అది కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. జనరల్‌గా వర్మ సినిమాలో కనిపించే టేకింగ్‌ కొన్ని సీన్స్‌లో కనిపించదు. చాలా సాధారణంగా వుంటుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో రవిశంకర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని నిలబెట్టింది. పాటల విషయానికి వస్తే ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా వుండదు. కథతోపాటే వెళ్ళే పాటలు, ఆకట్టుకోని సంగీతం మైనస్‌ అయ్యాయి. ఎడిటింగ్‌ గురించి చెప్పాల్సి వస్తే చాలా సీన్స్‌ అర్థంతరంగా ముగిసినట్టు, కొన్ని సీన్స్‌ అకస్మాత్తుగా వచ్చి పడ్డట్టు అనిపిస్తుంది. చైతన్యప్రసాద్‌, రాధాకృష్ణ మాటలు అంత పవర్‌ఫుల్‌గా అనిపించవు. ఇక డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ గురించి చెప్పాలంటే అతను గతంలో చేసిన రక్తచరిత్ర, కిల్లింగ్‌ వీరప్పన్‌ స్థాయిలో వంగవీటి చిత్రాన్ని తియ్యలేకపోయాడు అన్నది వాస్తవం. విజయవాడలో కొన్ని సంవత్సరాలపాటు జరిగిన సంఘటనల్ని రెండుంపావు గంటల సినిమాలో క్లుప్తంగా చెప్పడంలో విఫలమయ్యాడు. పేరుకి వంగవీటి సినిమా అయినప్పటికీ వంగవీటి రంగా యాక్టివిటీస్‌ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్‌ చెయ్యలేకపోయాడు. రంగా క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత దేవినేని ఫ్యామిలీకి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే రంగా కనిపిస్తుంటాడు తప్ప అతని మాటల్లో పదునుగానీ, చేతల్లో స్పీడుగానీ వుండదు. దీంతో వంగవీటి అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో విషయం మిస్‌ అయ్యిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. రక్తచరిత్రలోగానీ, కిల్లింగ్‌ వీరప్పన్‌లోగానీ సాధారణ ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు చూపించిన వర్మ ఈ సినిమా అందరికీ తెలిసిన విషయాల్ని కూడా పూర్తి స్థాయిలో చూపించలేకపోయాడు. ఒక దశలో ఇది వర్మ డైరెక్ట్‌ చేసిన సినిమాయేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఇక క్లైమాక్స్‌లో మోహనరంగాని ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనే విషయంలో క్లారిటీ లేకపోవడం సినిమాలో ఏముంది? అని ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. రామ్‌గోపాల్‌వర్మ వంగవీటి సినిమా చేయబోతున్నాడని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్‌ షో పడే వరకు సినిమా ఎలా వుండబోతోంది అనే ఉత్కంఠత ప్రేక్షకుల్లో వుంది. కానీ, సినిమా చూసిన తర్వాత సినిమాలో అంత విషయం లేదని అదే ప్రేక్షకులు తేల్చి చెప్పేస్తున్నారు. పైగా మితిమీరిన హింస ప్రేక్షకుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. వాస్తవంగా అప్పట్లో అంతటి రక్తపాతం జరిగినప్పటికీ సినిమాలో కూడా అదే స్థాయిలో చూపించాలన్న రూలేమీ లేదు కదా. సినిమాలో మర్డర్‌ సీన్స్‌ ఎక్కువ వున్నాయి. ఆయా సీన్స్‌ అన్నీ రక్తసిక్తంగా చూపించడానికి చాలా ఎక్కువ కష్టపడ్డారనిపిస్తుంది. అతి హింసతో కూడిన ఇలాంటి సినిమాకి సెన్సార్‌ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదో అర్థం కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎంతో హైప్‌తో రిలీజ్‌ అయిన వంగవీటి చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: వంగవీటి...అంతా రక్తసిక్తం 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017