సినీజోష్‌ రివ్యూ: అరకు రోడ్‌లో

Sun 04th Dec 2016 11:14 PM
సినీజోష్‌ రివ్యూ: అరకు రోడ్‌లో

శేషాద్రి క్రియేషన్స్‌ 

అరకు రోడ్‌లో 

తారాగణం: సాయిరామ్‌ శంకర్‌, నికీషా పటేల్‌, పంకజ్‌ కేసరి, 

అభిమన్యు సింగ్‌, కోవై సరళ, పృథ్వీ, సత్య తదితరులు 

సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి 

సంగీతం: రాహుల్‌ రాజ్‌, వాసుదేవ్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సాగర్‌ మహతి 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

నిర్మాతలు: బాలసుబ్రహ్మణ్యం మేక, వేగిరాజు ప్రసాద్‌రాజు, 

బచ్చు భాస్కర్‌, రామేశ్వరి నక్క 

రచన, దర్శకత్వం: వాసుదేవ్‌ 

విడుదల తేదీ: 02.12.2016 

143తో హీరోగా పరిచయమైన పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరామ్‌ శంకర్‌కి బంపర్‌ ఆఫర్‌ మంచి హిట్‌ సినిమా అయింది. ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. లేటెస్ట్‌గా అరకురోడ్‌లో చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా సాయిరామ్‌కి ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? అసలు అరకురోడ్‌లో ఏం జరిగింది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని టైటిల్స్‌లోనే వేసి కథను మొదలుపెట్టారు. గత కొంతకాలంగా అరకురోడ్‌లో లారీలు మాయమవుతున్నాయి. లారీ డ్రైవర్లు కూడా కనిపించకుండా పోతున్నారు. ఈ కేసు పోలీసులకు ఓ మిస్టరీలా మారింది. డ్రైవర్లను చంపి లారీలను ఎత్తుకుపోతున్న సీరియల్‌ కిల్లర్‌ జిన్నా(పంకజ్‌ కేసరి)ని మొత్తానికి పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. కట్‌ చేస్తే పోతురాజు(సాయిరామ్‌ శంకర్‌) ఓ ట్రక్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌. అతనికి ఐదేళ్ళ మేనకోడలు ఐశ్వర్య అంటే ఎంతో ఇష్టం. ఆమెకి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి రావడం, ఆపరేషన్‌కి ఐదు లక్షలు అవుతుందని డాక్టర్‌ చెప్పడంతో డబ్బు కోసం ప్రయత్నించి కొంత డబ్బు రెడీ చేస్తాడు. పేకాట పిచ్చి వున్న అతని బావ పేకాడి డబ్బు సంపాదిస్తానని ఆ డబ్బంతా పోగొడతాడు. క్లబ్‌కి సంబంధించిన వారితో పోతురాజు, అతని బావ గొడవ పడతారు. అదే టైమ్‌లో ఆ క్లబ్‌ ఓనర్‌ టోని(అభిమన్యు సింగ్‌) ముగ్గుర్ని మర్డర్‌ చేస్తాడు. అది పోతురాజు చూస్తాడు. పోతురాజు బావని నిర్బంధించి ఆ మూడు శవాలను ట్రక్‌లో తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి రమ్మంటాడు టోనీ. అలా చేస్తే అతనికి కావాల్సిన ఐదు లక్షలు ఇస్తానని, లేకపోతే అతని బావని చంపేస్తానని బెదిరిస్తాడు. చేసేది లేక మూడు శవాలను ట్రక్‌లో వేసుకొని బయల్దేరతాడు పోతురాజు. కట్‌ చేస్తే అరెస్ట్‌ అయిన జిన్నాని వ్యాన్‌లో తీసుకెళ్తుండగా పోలీసుల్ని చంపి తప్పించుకుంటాడు. శవాలతో బయల్దేరిన పోతురాజుకి పోలీస్‌ డ్రెస్‌లో తారసపడతాడు జిన్నా. టోనీ చెప్పినట్టుగా పోతురాజు శవాలను మాయం చేశాడా? పోలీస్‌ డ్రెస్‌లో వున్న జిన్నాని చూసి పోతురాజు ఎలా రియాక్ట్‌ అయ్యాడు? ఆ తర్వాత పోతురాజు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాడు? పోతురాజు తన మేనకోడలు ప్రాణాలు కాపాడగలిగాడా? అనేది మిగతా కథ. 

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లోలాగా హీరో అనగానే ఓ ఇంట్రడక్షన్‌ సాంగ్‌, స్పెషల్‌ మేనరిజం, ఎంతటి బలవంతుడినైనా చితగ్గొట్టే కెపాసిటీ వున్న హీరోలా కాకుండా నేచురల్‌గా వుండే క్యారెక్టరైజేషన్‌తో పోతురాజు క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. దానికి తగ్గట్టుగానే సాయిరామ్‌ శంకర్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగానే వుంది. హీరోయిన్‌ నికీషా పటేల్‌ తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జిన్నాగా పంకజ్‌ కేసరి పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు. సెకండాఫ్‌లో రిస్క్‌ రసూల్‌గా పృథ్వి చేసిన క్యారెక్టర్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ, వర్కవుట్‌ అవ్వలేదు. 

టెక్నీషియన్స్‌ గురించి చెప్పాలంటే జగదీష్‌ చీకటి కెమెరా వర్క్‌ బాగుంది. రాహుల్‌రాజ్‌, వాసుదేవ్‌ కలిసి చేసిన పాటల్లో ఒక పాట మాత్రమే ఆకట్టుకునేలా వుంది. కథ, కథనాలకు తగ్గట్టుగా సాగర్‌ మహతి చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ కూడా ఫర్వాలేదు. ఇక డైరెక్టర్‌ వాసుదేవ్‌ గురించి చెప్పాలంటే అరకురోడ్‌లో లారీలు, డ్రైవర్లు మిస్‌ అవుతున్నారన్న కాన్సెప్ట్‌తో సినిమాని స్టార్ట్‌ చేసి ఆ కథనే డెవలప్‌ చేసి సినిమా చేసి వుంటే మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయి వుండేది. కానీ, హీరో మేనకోడలు సెంటిమెంట్‌, మరో పక్క క్లబ్‌ ఓనర్‌ హత్యలు చేసి ఆ శవాలను హీరోకి అప్పగించడం, సెకండాఫ్‌లో సీరియల్‌ కిల్లర్‌ హీరోని వెంట తిప్పుకోవడం వంటి సీన్స్‌ ఆడియన్స్‌లో ఎలాంటి క్యూరియాసిటీని కలిగించలేకపోయాయి. పైగా ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ తర్వాత కథ అక్కడితో ఆగిపోయింది. సెకండాఫ్‌ నుంచి ప్రీ క్లైమాక్స్‌ వరకు కథలో ఎలాంటి కదలిక లేకుండా అనవసరమైన సీన్స్‌తో కాలయాపన చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో స్టార్ట్‌ చేసి రకరకాల ట్విస్ట్‌లు పెట్టి సినిమాని రన్‌ చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్‌. పృథ్వీ కామెడీ, ఓ ఐటమ్‌ సాంగ్‌ వంటివి సినిమా లెంగ్త్‌ కోసం తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు. సినిమాలో కథగా చెప్పుకోవడానికి మెయిన్‌ పాయింట్‌ అంటూ ఏమీ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. అలాగే మేనకోడలు సెంటిమెంట్‌ ఏ దశలోనూ వర్కవుట్‌ అవ్వలేదు. అలాగే కథ, కథనాల్లో ఎన్నో లాజిక్స్‌ని మిస్‌ చేశారు. కిల్లర్‌ పోలీస్‌ డ్రెస్‌లో ఎందుకు వున్నాడు? ఓ పోలీస్‌ ఆఫీసర్‌లాగే పై ఆఫీసర్‌తో కిల్లర్‌ ఎలా మాట్లాడగలిగాడు? వంటి విషయాలను రివీల్‌ చెయ్యలేదు. మంచి ఫోటోగ్రఫీ, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సాయిరామ్‌ శంకర్‌ నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌, అక్కడక్కడా నవ్వించే కొన్ని సీన్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, మెయిన్‌ కథని రన్‌ చేయకుండా మరో కథని లింక్‌ చేయడం, ఆకట్టుకోని మేనకోడలు సెంటిమెంట్‌, సినిమా లెంగ్త్‌ని పెంచే అనవసరమైన సీన్స్‌ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అనిపించే టైటిల్‌తో వచ్చిన అరకురోడ్‌లో ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే సస్పెన్స్‌, థ్రిల్‌ లేని ఓ సాధారణ చిత్రం. 

ఫినిషింగ్‌ టచ్‌: అరకురోడ్‌లో అన్నీ అప్‌సెట్సే 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017