సినీజోష్‌ రివ్యూ: బేతాళుడు

Fri 02nd Dec 2016 11:33 AM
vijay antony new movie bethaludu,bethaludu movie review,telugumovie bethaludu review in cinejosh,bethaludu movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: బేతాళుడు
సినీజోష్‌ రివ్యూ: బేతాళుడు

విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ 

బేతాళుడు 

తారాగణం: విజయ్‌ ఆంటోని, అరుంధతి నాయర్‌, చారు హాసన్‌, 

వై.జి.మహేంద్ర, కిట్టి, మీరాకృష్ణన్‌, మురుగదాస్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రదీప్‌ కలిపురయత్‌ 

సంగీతం: విజయ్‌ ఆంటోని 

ఎడిటింగ్‌: వీర సెంథిల్‌రాజ్‌ 

మాటలు-పాటలు: భాష్యశ్రీ 

నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోని 

రచన, దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి 

విడుదల తేదీ: 01.12.2016 

ఒకప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న విజయ్‌ ఆంటోని ని ఇప్పుడు హీరోగా ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం మూడు సినిమాలతో విజయ్‌ ఆంటోని హీరోగా టాలీవుడ్‌లో తన ఇమేజ్‌ని పెంచేసుకున్నాడు. నకిలి సినిమా రిలీజ్‌ అయినపుడు రాని గుర్తింపు డా|| సలీమ్‌ రిలీజ్‌ తర్వాత వచ్చింది. బిచ్చగాడు రిలీజ్‌ అయి తమిళ్‌ కంటే తెలుగులో పెద్ద హిట్‌ అవ్వడంతో ఇప్పుడు విజయ్‌ ఆంటోని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈమధ్య కాలంలో ఏ డబ్బింగ్‌ సినిమాకీ రాని టాక్‌, కలెక్షన్స్‌ బిచ్చగాడు చిత్రానికి వచ్చాయి. దీంతో ఈ సినిమా తర్వాత విజయ్‌ ఆంటోని చేసిన బేతాళుడుపై ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తమిళ్‌లో సైతాన్‌గా, తెలుగులో బేతాళుడుగా ఈరోజు విడుదలైన ఈ చిత్రాన్ని విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ నిర్మించింది. బిచ్చగాడుగా కోట్లు కొల్లగొట్టిన విజయ్‌ ఆంటోని బేతాళుడుగా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలిగాడా? సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎలాంటి థ్రిల్‌ని ఇచ్చింది? బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనికి బేతాళుడు మరో సూపర్‌హిట్‌ ఇవ్వగలిగిందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం. అది కామెడీ కావచ్చు, థ్రిల్లర్‌, హార్రర్‌, యాక్షన్‌.. ఇలా ఏదైనా కావచ్చు. సినిమా చూస్తున్న రెండున్నర గంటల సేపు అన్నీ మర్చిపోయి ఎంజాయ్‌ చెయ్యాలన్నదే ప్రతి ప్రేక్షకుడి కోరిక. మరి సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సినిమాలు ఎన్ని వస్తున్నాయి? ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను కాకుండా తమకు నచ్చిన కథల్ని, తమకి తోచిన విధంగా తీసుకుంటూ వెళ్ళే దర్శకులే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా కొంతమందికి మాత్రమే అర్థమయ్యే కథ, కథనాలతో రూపొందిన చిత్రమే ఈరోజు విడుదలైన బేతాళుడు. బిచ్చగాడు చిత్రానికి వచ్చిన క్రేజ్‌తో విజయ్‌ ఆంటోనికి తెలుగులో బిజినెస్‌ పరంగా మంచి ఆఫర్స్‌ వచ్చి వుండొచ్చు. కానీ, బేతాళుడు చిత్రంతో దాన్ని నిలబెట్టుకోలేకపోయారన్నది వాస్తవం. ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అనగానే హీరోకి తప్పనిసరి ఏదో ఒక లోపం వుండాలి కాబట్టి ఈ సినిమాలో హీరో దినేష్‌(విజయ్‌ ఆంటోని) ఒక మానసిక వ్యాధితో బాధపడుతుంటాడు. తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు, తన ముందు ఎవరో కదులుతున్నట్టు, తనని ఎవరో శాసిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. కొత్తగా పెళ్ళయిన దినేష్‌కి, అతని భార్య ఐశ్వర్య(అరుంధతి నాయర్‌)కి ఇదో పెద్ద సమస్యగా మారుతుంది. చివరికి ఓ సైకియాట్రిస్ట్‌ అతని సమస్యను గుర్తిస్తాడు. అతన్ని హిప్నటైజ్‌ చేసి గత జన్మలోకి తీసుకెళ్తాడు. గత జన్మలో తన పేరు శర్మ అని తెలుసుకుంటాడు దినేష్‌. శర్మ భార్య జయలక్ష్మీ. అతని భార్యే అతన్ని హత్య చేస్తుంది. ప్రస్తుతానికి వస్తే దినేష్‌ భార్య కూడా జయలక్ష్మీ పోలికలతోనే వుంటుంది. పెళ్ళయిన తర్వాతే దినేష్‌ మానసికంగా దెబ్బతింటాడు. దినేష్‌ మానసిక స్థితిలో మార్పు రావడానికి ఐశర్యే కారణమా? గత జన్మలో జయలక్ష్మీ.. శర్మని ఎందుకు చంపింది? దినేష్‌ని చంపడానికే ఐశ్వర్య రూపంలో జయలక్ష్మీ మళ్ళీ వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. 

నకిలి, డా|| సలీమ్‌, బిచ్చగాడు చిత్రాలతో నటుడుగా తనను తాను ప్రూవ్‌ చేసుకోవడమే కాకుండా తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న విజయ్‌ ఆంటోని బేతాళుడు చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. దినేష్‌గా, శర్మగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. జయలక్ష్మీగా, ఐశ్వర్యగా అరుంధతి నాయర్‌ చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. మిగిలిన క్యారెక్టర్స్‌లో వై.జి.మహేంద్ర, చారుహాసన్‌, మీరా కృష్ణన్‌, కిట్టి ఫర్వాలేదనిపించారు. 

కథ, కథనాలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి పక్కన పెడితే టెక్నికల్‌గా సినిమాని హై స్టాండర్డ్స్‌లోనే చేశారని చెప్పాలి. ప్రదీప్‌ ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ అయింది. ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి సీన్‌ని ఎంతో కేర్‌ తీసుకొని చేసినట్టు కనిపిస్తుంది. నకిలి, డా|| సలీమ్‌, బిచ్చగాడు చిత్రాల్లోని పాటలు సందర్భోచితంగా వుండడమే కాకుండా అందర్నీ ఆట్టుకున్నాయి. కానీ, ఈ సినిమా విషయంలో పాటలు సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యాయి. ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని గత సినిమాల కంటే అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. కొన్ని సీన్స్‌ అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల బాగా ఎలివేట్‌ అయ్యాయి. కథనానికి తగ్గట్టుగా వీర సెంథిల్‌రాజ్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు భాష్యశ్రీ అందించాడు. పైన చెప్పినట్టు పాటలు మ్యూజిక్‌ పరంగా, లిరిక్‌ పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అలాగే మాటలు కూడా అంత ఎఫెక్టివ్‌గా లేవు. డైరెక్టర్‌ ప్రదీప్‌ కృష్ణమూర్తి గురించి చెప్పాలంటే బేతాళుడు సినిమాతో అతను ఏం చెప్పదలుచుకున్నాడనే దానిలో క్లారిటీ లేదు. ఒక సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌తో ప్రారంభమైన కథని గత జన్మకి తీసుకెళ్ళి ఆ తర్వాత మరో ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ని ఎండ్‌ చేశాడు. సెకండాఫ్‌లో అయినా ఏదైనా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ వుంటుందా అని ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. సెకండాఫ్‌లో అసలు కథని వదిలిపెట్టి కొత్త కథలోకి వెళ్ళడంతోనే సినిమా డ్రాప్‌ అయిపోయింది. ట్రైలర్‌ చూసి ఎంతో థ్రిల్‌ అయిన ఆడియన్స్‌ సెకండాఫ్‌ చూసి డెఫినెట్‌గా షాక్‌ అవుతారు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో కూడా ఎలాంటి విశేషం లేకపోవడంతో బేతాళుడు అందర్నీ శాటిస్‌ఫై చెయ్యలేకపోయింది. సినిమా స్టార్ట్‌ అయిన నిముషంలోనే అసలు కథలోకి వెళ్ళిపోయి ఆసక్తికరమైన సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్‌పై ఇంట్రెస్ట్‌ కలిగించాడు ప్రదీప్‌. అలాగే ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో కూడా బాగా సక్సెస్‌ అయ్యాడు. సినిమాకి పెద్ద డ్రాబ్యాక్‌ సెకండాఫే. రెండు గంటల ఐదు నిముషాల సినిమా సెకండాఫ్‌ వల్ల మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో వున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా విజయ్‌ ఆంటోని నిర్మించాడు. చక్కని ఫోటోగ్రఫీ, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, థ్రిల్‌ చేసే ఫస్ట్‌ హాఫ్‌, విజయ్‌ ఆంటోని పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, సెకండాఫ్‌లో అసలు కథని వదిలి కొత్త కథలోకి వెళ్ళడం, సాదా సీదాగా వుండే క్లైమాక్స్‌, ఆకట్టుకోని పాటలు సినిమాకి మైనస్‌ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే తెలుగులో రిలీజ్‌ అయిన మూడు సినిమాలతో హిట్‌ కొట్టి హ్యాట్రిక్‌ సాధించిన విజయ్‌ ఆంటోని లేటెస్ట్‌ మూవీ బేతాళుడు మాత్రం ఒక సాధారణ చిత్రం అనిపించుకుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: విజయ్‌ ఆంటోని పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా... 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017