సినీజోష్‌ రివ్యూ: రెమో

Fri 25th Nov 2016 08:51 PM
telugu movie remo,sivakarthikeyan movie remo,remo movie review,remo movie review in cinejosh,remo movie cinejosh review,keerthi suresh in remo  సినీజోష్‌ రివ్యూ: రెమో
సినీజోష్‌ రివ్యూ: రెమో
24 ఎ.ఎం. స్టూడియోస్‌ 
రెమో 
తారాగణం: శివకార్తికేయన్‌, కీర్తి సురేష్‌, శరణ్య, కె.ఎస్‌.రవికుమార్‌, 
రాజేంద్రన్‌, ఆడుకాలం నరేన్‌ తదితరులు 
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌ 
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌ 
ఎడిటింగ్‌: రూబెన్‌ 
నిర్మాత: ఆర్‌.డి.రాజా 
రచన, దర్శకత్వం: భాగ్యరాజ్‌ కణ్ణన్‌ 
విడుదల తేదీ: 25.11.2016 
తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన చాలా సినిమాలు తెలుగులో కూడా ఘనవిజయం సాధించాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు, హై బడ్జెట్‌ సినిమాలకే ఆ అవకాశం ఎక్కువగా వుండేది. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా, హీరోలతో నిమిత్తం లేకుండా తమిళ్‌లో విజయవంతం అయిన సినిమాలు తెలుగులో అక్కడి కంటే ఎక్కువ లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి. దీంతో తమిళ్‌లో మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న హీరోల దృష్టి టాలీవుడ్‌పై పడింది. ఒక్కొక్కరుగా తమిళ హీరోలు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు శివకార్తికేయన్‌ కూడా ఆ దారిలోనే వెళ్తున్నాడు. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన రెమో చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్మాత ఆర్‌.డి.రాజా. భాగ్యరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించింది. ఈరోజు విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్‌ అయింది? శివకార్తికేయన్‌ని తెలుగు ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? తమళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి ఫలితం దక్కింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 
తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం లేదా అద్దె ఇల్లు కోసం మన హీరోలు లేడీ గెటప్స్‌ వేసి తద్వారా హాస్యాన్ని ప్రేక్షకులకు అందించిన సినిమాలు మనం గతంలో చూశాం. ఈరోజు విడుదలైన రెమో కూడా ఆ తరహా సినిమాయే. మన హీరో ఎస్‌.కె.కి నటన అంటే పిచ్చి. ఎలాగైనా హీరో అయిపోవాలని కలలు కంటూ వుంటాడు. కె.ఎస్‌.రవికుమార్‌ డైరెక్ట్‌ చేసే ఓ సినిమాలో లేడీ గెటప్‌ వెయ్యాలని తెలుసుకొని నర్సుగా అవతారమెత్తుతాడు. తన నటనతో రవికుమార్‌ని మెప్పిస్తాడు. ఆ గెటప్‌తోనే బస్సులో వెళ్తున్న ఎస్‌.కె. పక్కన తను ప్రేమించిన కావ్య(కీర్తి సురేష్‌) వచ్చి కూర్చుంటుంది. డాక్టర్‌ అయిన కావ్య తన హాస్పిటల్‌లో నర్స్‌ ఉద్యోగం వుందని చెప్పడంతో అదే గెటప్‌ని కంటిన్యూ చేసి నర్స్‌గా జాయిన్‌ అయిపోతాడు. తను ప్రేమించిన టైమ్‌కే కావ్యకి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోతుంది. అయితే ఆ పెళ్ళిని చెడగొట్టి కావ్యను తన సొంతం చేసుకోవడానికి రకరకాల ప్లాన్స్‌ వేస్తాడు ఎస్‌.కె. కావ్య ప్రేమను పొందడానికి ఎస్‌.కె. వేసిన ప్లాన్స్‌ ఏమిటి? నర్స్‌గా వెళ్ళిన అతను కావ్యను తనవైపు తిప్పుకోగలిగాడా? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిన కావ్య... ఎస్‌.కె.ను ఇష్టపడిందా? అనేది మిగతా కథ. 
శివకార్తికేయన్‌ నటుడుగా తమిళ్‌లో తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. అతని లుక్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ తెలుగు వారికి కొత్త. పైగా ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్‌ కూడా చేశాడు. లేడీ గెటప్‌లో నూటికి నూరుపాళ్ళు సక్సెస్‌ అయ్యాడు కార్తికేయన్‌. తన డాన్సులతో ఫైట్స్‌తో కూడా ఆకట్టుకున్నాడు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అతనికి ఎక్కువ మార్కులే పడతాయి. అయితే తెలుగు ఆడియన్స్‌ అతన్ని హీరోగా ఎంతవరకు యాక్సెప్ట్‌ చేస్తారన్నది డౌటే. ఇక హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ తన క్యారెక్టర్‌ పరిధిలో ఓకే అనిపిస్తుంది. అంతకుమించి ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం ఆమెకు లేదు. హీరో తల్లిగా శరణ్య క్యారెక్టర్‌ ఈమధ్య వచ్చిన డబ్బింగ్‌ సినిమాల్లో మాదిరిగానే వుంది తప్ప కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమున్న వారు ఎవరూ లేరు. 
సాంకేతికపరంగా చూస్తే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయింది. విజువల్స్‌ అన్నీ చాలా ఫ్రెష్‌గా, రిచ్‌గా అనిపిస్తాయి. అయితే పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో కలర్‌ షేడ్స్‌ ఇవ్వడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాంతో ఒరిజినాలిటీ మిస్‌ అయిపోయింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ పి.సి.శ్రీరామ్‌ అని టైటిల్స్‌లో వేసినా వాస్తవానికి ముగ్గురు వర్క్‌ చేశారు. అనిరుధ్‌ సంగీతం విషయానికి వస్తే సినిమాలోని ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా వుండదు. దానికి తగ్గట్టు లిరిక్స్‌ కూడా ఎవరికీ అర్థం కానట్టు వుంటాయి. కాకపోతే పాటల పిక్చరైజేషన్‌ కొంతవరకు బెటర్‌ అనిపిస్తుంది. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదనిపిస్తుంది. డైరెక్టర్‌ భాగ్యరాజ్‌ కణన్‌ గురించి చెప్పాల్సి వస్తే కథలో తీసుకున్న మెయిన్‌ పాయింటే నెగటివ్‌ కావడం పెద్ద మైనస్‌. తండ్రి మాట జవదాటని ఓ అమ్మాయి పెద్ద వారు చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోతుంది. నెలరోజుల్లో పెళ్ళి. హీరో అన్న తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాల్సిన అవసరం వుంది కాబట్టి ఎన్ని నాటకాలు ఆడైనా హీరోయిన్‌ని తనవైపు తిప్పుకోవడమే అతని లక్ష్యం. హీరోయిన్‌ని ఆకర్షించడం కోసం జరగాల్సిన పెళ్ళిని కూడా చెడగొట్టడానికి సిద్ధపడతాడు హీరో. ఎంగేజ్‌మెంట్‌కి ముందే ఆ అమ్మాయిని ప్రేమించడం, రోజుల తరబడి ఆమె వెంటపడడం, ఆమె ప్రేమ కోసం తపించడం వంటివి లేకుండానే ఆమెను తనవైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంటాడు. నర్సు గెటప్‌లో ఆమె చుట్టూనే తిరుగుతూ స్కెచ్‌ వేస్తుంటాడు. ఈ తతంగమంతా చాలా అసహజంగా అనిపిస్తుంది. ఏ అర్హతా లేకుండానే నర్సు గెటప్‌ వేసుకొని ఓ హాస్పిటల్‌లో పనిచేయడం సాధ్యమయ్యే పనేనా? పైగా నర్స్‌ గెటప్‌లో వున్నప్పుడు క్లీన్‌ షేవ్‌తో కనిపించే హీరో క్షణాల్లో తన ఒరిజినల్‌ గెటప్‌లోకి లైట్‌గా వున్న గడ్డంతో, చెంపల మీద చిక్స్‌తో వచ్చేస్తుంటాడు. ఆచరణ సాధ్యం కాని ట్రిక్స్‌ ప్లే చేస్తూ హీరోయిన్‌కి దగ్గరవుతుంటాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఇలాంటి అన్‌ నేచురల్‌ థింగ్స్‌ చాలా వుంటాయి. వీటిలో ఆడియన్స్‌ దేనికీ కన్విన్స్‌ అవ్వరు. తెలుగులో గతంలో వచ్చిన చిత్రం భళారే విచిత్రంలో నరేష్‌ వేసిన లేడీ గెటప్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ క్యారెక్టర్‌కి లేడీ వాయిస్‌తోనే డబ్బింగ్‌ చెప్పించడం చాలా ప్లస్‌ అయింది. ఈ సినిమా విషయానికి వస్తే మగ గొంతుతోనే లేడీలా మాట్లాడించడం ఎబ్బెట్టుగా అనిపించింది. తమిళ్‌లో శివకార్తికేయన్‌ మంచి ఇమేజ్‌ వున్న హీరో కావడం వల్ల ఇవన్నీ అక్కడ చెల్లుబాటు అయ్యాయి. కానీ, తెలుగు ఆడియన్స్‌ వీటన్నింటికీ కన్విన్స్‌ అవ్వడం కష్టం అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీల్‌ అయ్యే విషయం. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ స్కోప్‌ వున్న సబ్జెక్ట్‌ అయినప్పటికీ సినిమా మొత్తంలో ఆడియన్స్‌ నవ్వుకునే సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. తమిళ్‌లో బాంబుల్లా పేలిన పంచ్‌లు తెలుగులోకి వచ్చేసరికి తుస్సుమన్నాయి. హీరో పెర్‌ఫార్మెన్స్‌, హీరోయిన్‌ గ్లామర్‌, కొంతవరకు ఫోటోగ్రఫీ మాత్రమే ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ముఖ్యంగా నేటివిటీ మిస్‌ అవ్వడం, మెయిన్‌ థీమ్‌ నెగెటివ్‌ కావడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ పర్సెంటేజ్‌ తగ్గడం, నర్స్‌ గెటప్‌కి గొంతు మార్చి మగ గొంతుతోనే డబ్బింగ్‌ చెప్పించడం సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయి గొప్ప కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం సాదా సీదా చిత్రంగానే నిలుస్తుంది. 
ఫినిషింగ్‌ టచ్‌: విషయం తక్కువ.. హడావిడి ఎక్కువ 
సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5 

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017