సినీజోష్‌ రివ్యూ: ఎక్కడికి పోతావు చిన్నవాడా

Fri 18th Nov 2016 08:05 PM
nikhil new movie ekkadiki pothavu chinnavada,ekkadiki pothavu chinnavada movie review,ekkadiki pothavu chinnavada review in cinejosh,ekkadiki pothavu chinnavada cinejosh review  సినీజోష్‌ రివ్యూ: ఎక్కడికి పోతావు చిన్నవాడా
సినీజోష్‌ రివ్యూ: ఎక్కడికి పోతావు చిన్నవాడా

మేఘన ఆర్ట్స్‌ 

ఎక్కడికి పోతావు చిన్నవాడా 

తారాగణం: నిఖిల్‌, హెబ్బా పటేల్‌, నందిత శ్వేత, వెన్నెల కిషోర్‌, 

సత్య, ప్రవీణ్‌, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజా రవీంద్ర తదితరులు 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌ 

సంగీతం: శేఖర్‌ చంద్ర 

ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌ 

మాటలు: అబ్బూరి రవి 

నిర్మాత: పి.వెంకటేశ్వరరావు 

రచన, దర్శకత్వం: విఐ. ఆనంద్‌ 

విడుదల తేదీ: 18.11.2016 

ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవడం వల్ల కావచ్చు, ఎవరైనా హత్య చేయడం వల్ల కావచ్చు.. చనిపోయిన వ్యక్తి తాలూకు ఆత్మ మరొకరిలో ప్రవేశించడం మనం చాలా సినిమాల్లో చూశాం. తన ప్రియుడి లేదా ప్రియురాలి ప్రేమను పొందడం కోసం ఎంతమందినైనా బలి తీసుకోవడానికి వెనుకాడని ఆత్మల కథలతో తెలుగులో లెక్కకు మించిన సినిమాలు రూపొందాయి. అయితే ఆయా కథల్ని ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు. అలా ఒక ఆత్మకు సంబంధించిన కథతో విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమే ఈరోజు విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య.. ఇలా విభిన్నమైన కథల్ని సెలెక్ట్‌ చేసుకుంటూ వైవిధ్యమైన సినిమాల వైపే అడుగులు వేస్తూ సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్న నిఖిల్‌కి ఎక్కడికి పోతావు చిన్నవాడా మరో సక్సెస్‌ని ఇవ్వగలిగిందా? ఆత్మల కథలతో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు, ఈ సినిమాకి వున్న తేడా ఏమిటి? దర్శకుడు విఐ. ఆనంద్‌ ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

సినిమా అంటేనే ఫిక్షన్‌. అయితే కొన్ని సినిమాలు సహజత్వానికి దగ్గరగా వుంటూ నిత్యం మనం చూసే సంఘటనలు లేదా ఎప్పుడో మన అనుభవంలోకి వచ్చిన సంఘటనల్ని గుర్తు చేస్తాయి. ఇక ఆత్మల కథాంశంతో తీసిన సినిమాల్లోని సన్నివేశాలు దాదాపు మన జీవితంలో ఎప్పుడూ అనుభవంలోకి రావనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి సినిమాల కథ, కథనాల విషయంలో లాజిక్‌లు, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకపోవడమే మంచిది. కాకపోతే సినిమా చూసిన రెండున్నర గంటలు ప్రేక్షకుడ్ని తను చెప్పే కథతో కన్విన్స్‌ చెయ్యడంలోనే దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో డైరెక్టర్‌ ఆనంద్‌ కొంతవరకు సక్సెస్‌ అయినా, చాలా సందర్భాల్లో కన్విన్స్‌ చెయ్యలేకపోయాడు. 

కథ విషయానికి వస్తే అది 2012. మన హీరో అర్జున్‌(నిఖిల్‌) ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఫ్రెండ్స్‌ కలిసి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి వెళ్తాడు. తను ప్రేమించిన అమ్మాయి, పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఆయేషా కోసం ఎదురుచూస్తుంటాడు. కానీ, ఆమె రాదు. నిరాశతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు అర్జున్‌. కట్‌ చేస్తే 2016. అర్జున్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. అతని స్నేహితుడు కిషోర్‌(వెన్నెల కిషోర్‌)కి మతి స్థిమితం లేకపోవడంతో అతన్ని కేరళ తీసుకెళ్తాడు. అక్కడ అర్జున్‌కి పరియమవుతుంది అమల(హెబ్బా పటేల్‌). అక్కడ వున్న మూడు రోజుల్లో అర్జున్‌, అమల చాలా దగ్గరవుతారు. అంతలోనే అమల.. అర్జున్‌కి దూరమవుతుంది. అమలకి సంబంధించిన చిన్న ఆధారంతో విజయవాడ వెళ్ళి ఆమె తండ్రిని కలుస్తాడు అర్జున్‌. అమల నాలుగు సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్‌లో చనిపోయిందని ఆమె తండ్రి చెప్పిన మాటలు విని షాక్‌ అవుతాడు అర్జున్‌. ఆ తర్వాత అనుకోకుండా అమలను కలుస్తాడు. తన పేరు నిత్య అని, నువ్వెవరో తనకు తెలీదని చెప్తుంది. దీంతో మరింత షాక్‌ అయిన అర్జున్‌కి నిత్య చెల్లెలు అసలు విషయం చెప్తుంది. నిత్యను అమల ఆత్మ ఆవహించిందని, కేరళలో ఆ ఆత్మను వదిలించామని అర్జున్‌కి క్లారిటీ ఇస్తుంది. ఇలాంటి విషయాలు నమ్మని అర్జున్‌ ఆ అయోమయంలో వుండగానే ఫోన్‌ మోగుతుంది. నేను అమలను మాట్లాడుతున్నాను, నిన్ను కలవడానికి వస్తున్నాను అంటూ అవతలి వ్యక్తి వాయిస్‌ వినిపిస్తుంది. దీంతో అర్జున్‌కి నోట మాట రాదు. అసలు అమల ఎవరు? అప్పటివరకు నిత్య శరీరంతో వున్న అమల ఆత్మ మళ్ళీ అర్జున్‌కి ఎందుకు ఫోన్‌ చేసింది? నిత్య రూపంలో వున్న అమలను ప్రేమించిన అర్జున్‌ మరో అమ్మాయి రూపంలో వచ్చిన అమలను చూసి ఎలా రియాక్ట్‌ అయ్యాడు? ఒకరి శరీరంలో నుంచి మరో శరీరంలోకి ఈజీగా మారిపోతున్న అమల అసలు కథ ఏమిటి? ఆ ఆత్మ అర్జున్‌నే ఎందుకు టార్గెట్‌ చేసింది? అనేది మిగతా కథ. 

ఒక సిన్సియర్‌ లవర్‌గా, తనను ప్రేమించే ఆత్మ నుంచి తప్పించుకోవడానకి రకరకాలుగా ప్రయత్నించే కుర్రాడిగా నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. బేసిక్‌ కథ ఒక అమ్మాయి ఆత్మకు సంబంధించింది కావడంతో హీరో క్యారెక్టర్‌కి కొంత ప్రాధాన్యత తగ్గింది. కుమారి 21ఎఫ్‌తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న హెబ్బా పటేల్‌ ఈ చిత్రంలో ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకునే కనిపించలేదు. ఫస్ట్‌హాఫ్‌లో అమలగా, సెకండాఫ్‌లో నిత్యగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ ఓకే అనిపించేలా వుంది. సెకండాఫ్‌లో పార్వతి శరీరంలోకి అమల ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ క్యారెక్టర్‌లో నందిత శ్వేత పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం అనే చెప్పాలి. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన నందిత తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సెకండాఫ్‌లో నందిత పెర్‌ఫార్మెన్స్‌ బాగా హైలైట్‌ అయింది. వెన్నెల కిషోర్‌, సత్య, ప్రవీణ్‌, సుదర్శన్‌ చేసిన కామెడీ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. అవికాగోర్‌ చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అవికా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. 

ఫస్ట్‌హాఫ్‌లోని అందమైన లొకేషన్స్‌, చక్కని సినిమాటోగ్రఫీ, ఆకట్టుకునే కెమెరా వర్క్‌ ఈ చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యాయి. సాయిశ్రీరామ్‌ ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో కేర్‌ తీసుకొని చేసినట్టు తెలుస్తుంది. శేఖర్‌చంద్ర చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఎక్స్‌లెంట్‌ అనిపించాడు. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. టెక్నికల్‌గా అన్నీ కుదరడంతో సినిమా రిచ్‌గా కనిపిస్తుంది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఇక డైరెక్టర్‌ విఐ. ఆనంద్‌ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన ఆత్మల కథలకు భిన్నమైన కథ కాకపోయినా స్క్రీన్‌ప్లే, బ్యాక్‌డ్రాప్‌, మెయిన్‌ టెయిన్‌ చేసిన సస్పెన్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఫస్ట్‌హాఫ్‌ కంప్లీట్‌ అయిన తర్వాత సెకండాఫ్‌లో ఏం జరగబోతోందనేది సగటు ప్రేక్షకుడు ఊహించడం కష్టమే. ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్న ఆనంద్‌ సెకండాఫ్‌ కథని ఆడియన్స్‌ కన్విన్స్‌ అయ్యేలా చెప్పడంలో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. వెంట వెంటనే వచ్చే ఫ్లాష్‌ బ్యాక్‌లు, ట్విస్ట్‌లతో కొంత సేపు ఆడియన్స్‌ని అయోమయంలో పడేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్ళే ప్రాసెస్‌లో రాసుకున్న సీన్స్‌ ఆడియన్స్‌కి కాసేపు బోర్‌ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌ ఎంతో భారీగా వుంటుందని ఊహించిన ఆడియన్స్‌కి నిరాశే ఎదురవుతుంది. కథకి క్లైమాక్స్‌ వుండాలి అన్నట్టు ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్‌ చేశారు. కొత్తదనం కోరుకునేవారిని, ఆత్మల కథలు ఇష్టపడేవారిని కొంతవరకు ఈ సినిమా శాటిస్‌ఫై చేస్తుంది. కామెడీని కోరుకునే ఆడియన్స్‌కి అక్కడక్కడా నవ్వుకునే అవకాశం కూడా వుంది. ఫైనల్‌గా చెప్పాలంటే నిఖిల్‌, విఐ. ఆనంద్‌ చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒకసారి చూసి ఎంజాయ్‌ చేయవచ్చు అనిపించే సినిమా. 

ఫినిషింగ్‌ టచ్‌: ఒకే అనిపించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017