సినీజోష్‌ రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

Fri 11th Nov 2016 07:48 PM
telugu movie sahasam swasagaa saagipo,sahasam swasagaa saagipo movie review in cinejosh,sahasam swasagaa saagipo movie cinejosh review,naga chaitanya new movie sahasam swasagaa saagipo,gowtham menon new movie sahasam swasagaa saagipo  సినీజోష్‌ రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో
సినీజోష్‌ రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

ద్వారకా క్రియేషన్స్‌ 

సాహసం శ్వాసగా సాగిపో 

తారాగణం: నాగచైతన్య, మంజిమ మోహన్‌, బాబా సెహగల్‌, 

సతీష్‌ కృష్ణన్‌, నాగినీడు, రాకేందుమౌళి తదితరులు 

సినిమాటోగ్రఫీ: డాన్‌ మెకర్తర్‌, డానీ రేమండ్‌ 

ఎడిటింగ్‌: ఆంటోనీ 

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ 

మాటలు: కోన వెంకట్‌ 

సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి 

నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి 

రచన, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ 

విడుదల తేదీ: 11.11.2016 

లవ్‌స్టోరీస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌తో వుండే ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్స్‌, తండ్రీ కొడుకుల అనుబంధాల్ని ఆవిష్కరించే చిత్రాలు... ఇలా విభిన్న కథాంశాలు, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్స్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించడంలో డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ది అందె వేసిన చేయి. తెలుగులో అతను చేసిన సినిమాల్లో అందరికీ గుర్తుండిపోయే చిత్రం ఏమాయ చేసావె. ప్రేమకథా చిత్రాల్లోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈ సినిమా నాగచైతన్య, సమంత కెరీర్‌లను టర్న్‌ చేసింది. తాజాగా నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ మరో కొత్త తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాహసం శ్వాసగా సాగిపో పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏమాయ చేసావె వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని కలిగించింది? ప్రేమ కథకి యాక్షన్‌ని మిక్స్‌ చేసి గౌతమ్‌ మీనన్‌ రూపొందించిన ఈ సినిమా నాగచైతన్యకి మరో హిట్‌ని ఇవ్వగలిగిందా? ఈ చిత్రంతో పరిచయమైన మంజిమ మోహన్‌కి హీరోయిన్‌గా ఎలాంటి భవిష్యత్తు వుంటుంది? గౌతమ్‌ మీనన్‌ చేసిన ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఏమాయ చేసావె స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం లవ్‌ అండ్‌ ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో లవ్‌తోపాటు యాక్షన్‌ని కూడా మిక్స్‌ చేయడం వల్ల కొత్తగా అనిపించకపోగా ప్రేక్షకుల్ని విపరీతంగా విసిగించింది. ఏమాయ చేసావె చిత్రంలో మాదిరిగానే ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఖాళీగా వుంటాడు మన హీరో రజనీకాంత్‌(నాగచైతన్య). అయితే ఈ చిత్రంలో అతనికి నలుగురు ఫ్రెండ్స్‌ని కూడా జతచేశారు. స్కూల్‌ డేస్‌ నుంచి కాలేజ్‌ డేస్‌ వరకు సక్సెస్‌ అవ్వని రెండు లవ్‌స్టోరీలు కూడా రజనీకాంత్‌కి వుంటాయి. ఫ్రెండ్స్‌తో జాలీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న మన హీరో... లీల(మంజిమ మోహన్‌)ని మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆ అమ్మాయి తన చెల్లెలి ఫ్రెండ్‌ కావడం, కొన్నిరోజులు తమ ఇంట్లోనే వుండడంతో వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌ పెరుగుతుంది. ఓరోజు తన ఫ్రెండ్‌ మహేష్‌(రాకేందు మౌళి)తో కలిసి బైక్‌పై కన్యాకుమారి వెళ్ళాలని ప్లాన్‌ చేసుకుంటాడు. లాస్ట్‌ మూమెంట్‌లో బైక్‌పై తనూ కన్యాకుమారి వస్తానని రెడీ అవుతుంది లీల. అలా బైక్‌పై రజనీకాంత్‌, లీల జర్నీ స్టార్ట్‌ అవుతుంది. కన్యాకుమారి వెళ్ళి సన్‌రైజ్‌ చూసి ఎంజాయ్‌ చేసిన తర్వాత హైవేలో వస్తోన్న వీరి బైక్‌ని ఓ లారీ ఢీకొడుతుంది. తీవ్రంగా గాయపడ్డ రజనీకాంత్‌ని లీల హాస్పిటల్‌లో చేర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మూడు రోజుల తర్వాత లీల నుంచి కాల్‌ వస్తుంది. అది యాక్సిడెంట్‌ కాదని, తనని చంపడానికి వేసిన ప్లాన్‌ అని, తన తండ్రిపై కూడా హత్యాప్రయత్నం జరగడం వల్ల హాస్పిటల్‌ నుంచి వెంటనే వెళ్ళిపోయానని లీల చెప్తుంది. ఇది విన్న రజనీకాంత్‌ షాక్‌ అవుతాడు. లీలను ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు? తను ప్రేమించిన లీలకు ఎదురైన ఈ సమస్యను రజనీకాంత్‌ ఎలా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. 

ఏమాయ చేసావె చిత్రం తర్వాత యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేసిన నాగచైతన్య ఈమధ్య వచ్చిన ప్రేమమ్‌తో మరోసారి తనలోని లవ్‌ యాంగిల్‌ని అందంగా ప్రజెంట్‌ చెయ్యగలిగాడు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విషయానికి వస్తే ఇందులో లవ్‌ యాంగిల్‌తోపాటు, యాక్షన్‌, ఎమోషన్‌ యాంగిల్‌ కూడా వుంది. వీటన్నింటినీ బ్యాలెన్స్‌ చెయ్యడంలో నాగచైతన్య పూర్తి స్థాయిలో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్‌ని చదువుతున్నట్టుగా వుంటుందే తప్ప క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి చెప్తున్నట్టు అనిపించదు. ప్రేమమ్‌తో కంపేర్‌ చేస్తే ఈ సినిమాలో నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌కి చాలా తక్కువ మార్కులు పడతాయి. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మంజిమ మోహన్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. కొన్ని సీన్స్‌లో బెటర్‌ అనిపించినా, కొన్ని సీన్స్‌లో పేలవంగా వుంది. సెకండాఫ్‌లో ఆమెకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం కూడా ఎక్కువ లేదు. ఈ సినిమాలో మనకు పరిచయమున్న ఆర్టిస్టులు చాలా తక్కువ. పోలీస్‌ ఆఫీసర్‌గా చేసిన బాబా సెహగల్‌ అతని క్యారెక్టర్‌కి వున్నంతలో న్యాయం చేశాడు. హీరోయిన్‌ తండ్రిగా నటించిన నాగినీడు ఒకే ఒక సీన్‌లో కనిపిస్తాడు. ఆ తర్వాత అతన్ని స్ట్రెచర్‌ మీద నుంచి దించలేదు. 

ఈ చిత్రానికి టెక్నికల్‌గా వున్న ఎస్సెట్స్‌ చాలా తక్కువ. డాన్‌ మెకర్తన్‌, డానీ రేమండ్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ఫస్ట్‌హాఫ్‌లోని లవ్‌ సీన్స్‌ని గానీ, పాటల్ని గానీ ఎఫెక్టివ్‌గా తియ్యలేకపోయారు. ఫోటోగ్రఫీ పరంగా రిచ్‌నెస్‌ అనేది సినిమాలో ఎక్కడా కనిపించదు. నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో ఏమాయ చేసావె వంటి మ్యూజికల్‌ హిట్‌ ఇచ్చిన ఎ.ఆర్‌.రెహమాన్‌ కూడా ఈ సినిమా విషయంలో చేతులెత్తేసాడు. చకోరి, తాను నేను పాటలు మాత్రమే బాగున్నాయి. మిగతా పాటల్లో రణగొణ ధ్వనులు తప్ప సాహిత్యం అనేది వినిపించదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని కూడా ఇంప్రెసివ్‌గా చెయ్యలేకపోయాడు రెహమాన్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ మరో పెద్ద మైనస్‌ అయింది. సినిమాలోని కొన్ని సీన్స్‌ని అర్థంతరం ముగించడం, కొన్ని సీన్స్‌కి కంటిన్యుటీ లేకపోవడం, అనవసరమైన సీన్స్‌తో సినిమా లెంగ్త్‌ని పెంచడం వంటివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. కోన వెంకట్ రాసిన మాటలు ఏ సందర్భంలోనూ ఆకట్టుకోలేదు. మేకింగ్‌ పరంగా సినిమాలో రిచ్‌నెస్‌ ఎక్కడా కనిపించదు. చాలా సాదా సీదాగా వుండే బ్యాక్‌డ్రాప్‌లో, అంతే క్వాలిటీతో వున్న సీన్స్‌తో ఓ మామూలు సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుందే తప్ప ఆడియన్స్‌ని విజువల్‌గా ఇంప్రెస్‌ చేసే అంశాలు ఎక్కడా కనిపించవు. ఇక డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ గురించి చెప్పాలంటే తీసిన సినిమానే మార్చి మార్చి కొత్త ఆర్టిస్టులతో, కొత్త టైటిల్‌తో మళ్ళీ తీస్తున్నాడా అనే డౌట్‌ సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని చూస్తే వస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ మధ్య ఫ్రెండ్‌షిప్‌ డెవలప్‌ అయ్యే సీన్స్‌ అన్నీ ఏమాయ చేసావె చిత్రాన్ని గుర్తు చేస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అయ్యే ముందు ఒక ట్విస్ట్‌ ఇస్తాడు. సెకండాఫ్‌ అంతా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వెళ్తుంది. హీరోయిన్‌, ఆమె తల్లిదండ్రులపై ఎటాక్‌ జరిగిందంటే చాలా పెద్ద కథ వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఆడియన్స్‌కి నిరాశే మిగులుతుంది. ఒక సాదా సీదా పాయింట్‌ని తీసుకొని సెకండాఫ్‌ అంతా నడిపించాడు. అది కూడా ఆడియన్స్‌ కన్విన్స్‌ అయ్యేలా చెప్పలేకపోయాడు గౌతమ్‌. ఇక క్లైమాక్స్‌లో హీరో రజనీకాంత్‌ డిసిపిగా ఎంట్రీ ఇవ్వడం ఆడియన్స్‌కి నవ్వు తెప్పిస్తుంది. అప్పటివరకు సీరియస్‌గా నడిచిన కథకి అది కామెడీ టచప్‌గా అనిపిస్తుంది. అసలు హీరోయిన్‌ ఫ్యామిలీపై ఎందుకు ఎటాక్‌ జరిగిందనే విషయాన్ని తన నోటితోనే సుదీర్ఘంగా చెప్పి ఆడియన్స్‌కి క్లైమాక్స్‌లో కూడా బోర్‌ కొట్టించాడు చైతన్య. ఫస్ట్‌హాఫ్‌ స్టార్టింగ్‌లో ఒక గోల పాటతో, ఆ తర్వాత కొన్ని రొటీన్‌ సీన్స్‌తో బోర్‌ ఫీల్‌ అవుతున్న ఆడియన్స్‌ హీరో, హీరోయిన్‌ కలిసి కన్యాకుమారి రోడ్‌ ట్రిప్‌కి బయల్దేరడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆ ఆనందం కూడా ఎంతో సేపు నిలవదు. వాళ్ళ రోడ్‌ ట్రిప్‌ పూర్తి కాగానే ఆ ఆనందం కూడా అంతమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే లవ్‌, యాక్షన్‌ మిక్స్‌ చేసి నాగచైతన్యతో గౌతమ్‌ మీనన్‌ చేసిన ఈ ఎక్స్‌పెరిమెంట్‌ సక్సెస్‌ అవ్వలేదు. లవ్‌ పరంగా, యాక్షన్‌ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఏ విధంగానూ సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చెయ్యలేకపోయింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఏమాయ చేసావె తర్వాత మరో హిట్‌ కొట్టాలనుకున్న నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ల ప్రయత్నం బెడిసికొట్టింది. 

ఫినిషింగ్‌ టచ్‌: సినిమా చూడాలంటే సాహసం చెయ్యాల్సిందే 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017