సినీజోష్‌ రివ్యూ: మన ఊరి రామాయణం

Sat 08th Oct 2016 04:21 PM
telugu movie mana oori ramayanam,mana oori ramayanam movie review,mana oori ramayanam review in cinejosh,mana oori ramayanam cinejosh review,prakash raj latest movie mana oori ramayanam  సినీజోష్‌ రివ్యూ: మన ఊరి రామాయణం
సినీజోష్‌ రివ్యూ: మన ఊరి రామాయణం

ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్‌, ఫస్ట్‌ కాపీ పిక్చర్స్‌ 

మన ఊరి రామాయణం 

తారాగణం: ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, సత్యదేవ్‌, అచ్యుత్‌కుమార్‌, 

రఘుబాబు, పృథ్విరాజ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ 

సంగీతం: ఇళయరాజా 

ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌ 

కథ: జాయ్‌ మాథ్యూ 

మాటలు: గోపిశెట్టి రమణ, ప్రకాష్‌రాజ్‌ 

నిర్మాతలు: రామ్‌జీ నరసింహన్‌, ప్రకాష్‌రాజ్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌ 

విడుదల తేదీ: 07.10.2016 

కొన్ని సంఘటనలు మనిషి జీవితంలో పెను మార్పులు తీసుకొస్తాయి. అప్పటివరకు జీవితంలో తాము చేసిన తప్పుల్ని తలుచుకొని కుమిలిపోతారు. చెడు మార్గంలో వున్నవారిని ఆ సంఘటనలు మంచి మార్గంలో నడిపిస్తాయి. నటుడు, దర్శకుడు ప్రకాష్‌రాజ్‌ రూపొందించిన మన ఊరి రామాయణం ఇదే కథాంశంతో రూపొందింది. ధోని, ఉలవచారు బిర్యాని వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రకాష్‌రాజ్‌. తాజాగా మలయాళంలో రూపొందిన షట్టర్‌ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్‌ చేశాడు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న షట్టర్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ చెయ్యడంలో ప్రకాష్‌రాజ్‌ సక్సెస్‌ అయ్యాడా? ప్రధాన పాత్ర పోషించిన ప్రకాష్‌రాజ్‌కి నటుడుగా ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? మన ఊరి రామాయణం చిత్రం ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

భుజంగయ్య(ప్రకాష్‌రాజ్‌) దుబాయ్‌ వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తన ఊరిలో ఓ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు. నాణానికి రెండు వైపులు వున్నట్టుగానే ఊళ్ళో అతని గురించి చెడుగా మాట్లాడుకునేవారు, మంచిగా చెప్పుకునే వాళ్ళూ వున్నారు. ఊళ్ళో జరిగే రాముల వారి ఉత్సవాల్లో కూడా తన ఉనికిని కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతుంటాడు. ఆ ఊళ్ళో వేసే నాటకంలో రావణాసురుడి వేషం కూడా వేస్తుంటాడు. ఊళ్ళో ఎంతో పలుకుబడి వున్నా ఇంట్లో మాత్రం అతనికి ఎప్పుడూ చుక్కెదురే. అతని కూతురు కూడా అతని మాట వినదు. రావణాసురుడు వేషం వెయ్యడం కాదు, నిజంగానే భుజంగయ్య రావణాసురుడు అనేది ఇంట్లో వారి అభిప్రాయం. చదువుకోవడానికి ఇష్టపడే కూతురి చదువు మాన్పించి పెళ్ళి చేస్తానంటాడు. ఈ విషయంలో అప్పుడప్పుడూ ఇంట్లో గొడవ పడి రెండు మూడు రోజులు కనపడకుండా పోతుంటాడు. అలా ఓ రాత్రి బయటికి వచ్చిన భుజంగయ్య పీకల దాకా తాగేస్తాడు. తన అసిస్టెంట్‌ అయిన శివ(సత్యదేవ్‌) ఆటోలో ఇంటికి బయల్దేరతాడు. ఆ సమయంలో బస్‌స్టాండ్‌లో వెయిట్‌ చేస్తున్న సుశీల(ప్రియమణి)ని తనకి సెట్‌ చేయమని శివని అడుగుతాడు. సుశీలతో మాట్లాడి ఆటో ఎక్కిస్తాడు శివ. ఆటోలో తన ఇంటికి ఆనుకొని వున్న షాపుకి చేరుకుంటారు. గుట్టు చప్పుడు కాకుండా భుజంగయ్యని, సుశీలని పంపించి గంటలో మళ్ళీ వస్తానని షాపుకి తాళం వేసి శివ వెళ్ళిపోతాడు. కానీ, శివ రాడు. అతని కోసం ఇద్దరూ వెయిట్‌ చేస్తుంటారు. ఎప్పుడూ పర స్త్రీ జోలికి వెళ్ళని భుజంగయ్య తను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. సుశీలని టచ్‌ చెయ్యడానికి కూడా భయపడతాడు. తెల్లవారితే తను సుశీలతో వున్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఊళ్ళో తను తలెత్తుకు తిరగలేడు. ఇంట్లో వాళ్ళకి తన మొహం చూపించలేడు. ఇలా ఆలోచిస్తున్న భుజంగయ్యని సుశీల తన మాటలతో టార్చర్‌ పెడుతూ వుంటుంది. అప్పుడు భుజంగయ్య డబ్బుతో ఆమె నోరు మూయిస్తాడు. గంటలో వస్తానని వెళ్ళిన శివ ఎందుకు రాలేకపోయాడు? ఆ ఇద్దరూ అలా ఎంత సేపు వెయిట్‌ చేశారు? షాపులో స్టక్‌ అయిపోయిన భుజంగయ్యకి ఎలాంటి అనుభవం ఎదురైంది? అలా ఎన్నిరోజులు ఆ షాపులోనే వుండిపోవాల్సి వచ్చింది? చివరికి ఆ గండం నుంచి భుజంగయ్య తప్పించుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

భుజంగయ్య పాత్రలో ప్రకాష్‌రాజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. ఊళ్ళో పరపతి పెంచుకోవాలనుకునే వ్యక్తిగా, తన ఇంట్లో తనకి విలువ లేదని బాధపడే ఇంటి పెద్దగా, ఓ వేశ్య వల్ల ఇబ్బంది పడుతూ, టెన్షన్‌ పడుతూ ఆ గండం నుంచి బయట పడాలని తాపత్రయ పడే వాడిగా.. ఇలా అన్ని ఎమోషన్స్‌ని పర్‌ఫెక్ట్‌గా క్యారీ చెయ్యడంలో ప్రకాష్‌రాజ్‌ సక్సెస్‌ అయ్యాడు. వేశ్యగా ప్రియమణి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. భుజంగయ్య అసిస్టెంట్‌గా సత్యదేవ్‌ నటన ఎంతో సహజంగా అనిపిస్తుంది. డైరెక్టర్‌ గరుడ శ్రీనివాస్‌గా పృథ్వీ ఓ కొత్త తరహా పాత్రను చేశాడు. ఇప్పటివరకు స్ఫూఫ్‌ డైలాగ్స్‌తో అందర్నీ నవ్వించిన పృథ్వీ ఈ సినిమాలో ఓ డిగ్నిఫైడ్‌ క్యారెక్టర్‌ చేశాడు. ఈమధ్యకాలంలో అతను చేసిన వెరైటీ క్యారెక్టర్‌ ఇదే. సి.ఐ.గా నటించిన రఘుబాబు కనిపించిన కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఇళయరాజా మ్యూజిక్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అన్ని సీన్స్‌ని ఎలివేట్‌ చేసేలా వుంది. పాటలు కూడా సందర్భాన్ని బట్టి ఫర్వాలేదు అనిపిస్తాయి. ముఖేష్‌ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్‌ అయింది. కథ విషయానికి వస్తే జాయ్‌ మాథ్యూ చేసిన కథలో కొత్తదనం వున్నా దాన్ని తెలుగులో ఆకట్టుకునేలా తియ్యడంలో ప్రకాష్‌రాజ్‌ పూర్తిగా సక్సెస్‌ అవ్వలేకపోకపోయాడు. స్లో నేరేషన్‌తో స్టార్ట్‌ అయ్యే ఈ సినిమాలోని ఫస్ట్‌ హాఫ్‌లో అనవసరమైన సీన్స్‌తో కథలోకి వెళ్లకుండా తాత్సారం చేశాడు. భుజంగయ్య, ఫ్రెండ్స్‌ అందరూ కలిసి మందు కొడుతూ పాటలు పాడే సన్నివేశం, ఇంట్లో వారితో గొడవ పడే సన్నివేశాలు పదే పదే చూపించడంతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ప్రియమణి క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాతే సినిమా స్పీడ్‌ అందుకుంటుంది. సెకండాఫ్‌ అంతా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. రెండు గంటలలోపు సినిమా అయినా సెకండాఫ్‌ మాత్రమే చూసేదిగా వుండడం, ఫస్ట్‌ హాఫ్‌ అంతా బోర్‌ కొట్టించడంతో ఫస్ట్‌ హాఫ్‌ సినిమాకి మైనసగా మారింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక్క సంఘటన మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనే విషయాన్ని మన ఊరి రామాయణం చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు తక్కువగా వున్నా విభిన్న కథా చిత్రాలు చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కొందరికే నచ్చే రామాయణం 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017