సినీజోష్‌ రివ్యూ: ఈడు గోల్డ్‌ ఎహే

Sat 08th Oct 2016 07:57 AM
సినీజోష్‌ రివ్యూ: ఈడు గోల్డ్‌ ఎహే

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌(ఇండియా) ప్రై. లిమిటెడ్‌ 

ఈడు గోల్డ్‌ ఎహే 

తారాగణం: సునీల్‌, సుష్మారాజ్‌, రిచా పనయ్‌, జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, 

నరేష్‌, అరవింద్‌, షకలక శంకర్‌, పృథ్వీ, వెన్నెల కిషోర్‌, పోసాని తదితరులు 

సినిమాటోగ్రఫీ: దేవ్‌రాజ్‌ 

సంగీతం: సాగర్‌ మహతి 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

సమర్పణ: ఎటివి 

నిర్మాత: రామబ్రహ్మం సుంకర 

రచన, దర్శకత్వం: వీరూ పోట్ల 

విడుదల తేదీ: 07.10.2016 

కమెడియన్‌ నుంచి హీరోగా కన్వర్ట్‌ అయిన సునీల్‌ అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు తర్వాత హిట్‌ అందుకోలేకపోయాడు. ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాలు విజయం సాధించలేకపోయాయి. ఇటీవల విడుదలైన జక్కన్న కూడా వాటి సరసనే చేరింది. తాజాగా వీరూ పోట్ల దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈడు గోల్డ్‌ ఎహే చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీల్‌. ఈరోజు విడుదలైన ఈ చిత్రం సునీల్‌కి హిట్‌ ఇవ్వగలిగిందా? ఈమధ్యకాలంలో హిట్‌ లేని వీరూ పోట్లకి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మహదేవ్‌(పునీత్‌ ఇస్సార్‌) ఇల్లీగల్‌ బిజినెస్‌లు చేస్తూ కోట్లు గడించాడు. అతనికి బెట్టింగ్‌ వ్యాపారం కూడా వుంది. బెట్టింగ్‌ ద్వారా సంపాదించిన 900 కోట్ల రూపాయలను లాఫింగ్‌ బుద్ధ విగ్రహానికి డైమండ్స్‌ అమర్చడం ద్వారా కన్వర్ట్‌ చేస్తాడు. వివిధ ప్రాంతాల నుంచి ఆ విగ్రహాలను తెప్పించి ఒక చోట భద్రపరుస్తాడు. కట్‌ చేస్తే... అతని పేరు బంగార్రాజు(సునీల్‌). విజయవాడలో నారదరావు(పృథ్వీ) దగ్గర కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తాడు. బంగార్రాజుకి పని ఇచ్చిన వారికి తిప్పలు తప్పవు అనేది కొన్ని సంఘటనల ద్వారా ప్రూవ్‌ అవుతుంది. బంగార్రాజుకి పని ఇవ్వడం వల్ల చావు దెబ్బలు తినాల్సి వచ్చిన నారదరావు.. అతన్ని హైదరాబాద్‌లో వున్న అతని స్నేహితుడి దగ్గరికి పంపిస్తాడు. అలా హైదరాబాద్‌ చేరుకున్న బంగార్రాజుకి దేవుడిచ్చిన తల్లిలా జయసుధ కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లోనే వుంటూ తమ్ముడి గార్మెంట్స్‌ షాపులో పనిచేస్తుంటాడు. ఆ సమయంలో బంగార్రాజుకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. తన రూపంలోనే సునీల్‌వర్మ అనే వ్యక్తి వున్నాడని తెలుసుకుంటాడు. తనని సునీల్‌ వర్మ అనుకొని అందరూ పలకరిస్తుంటారు. మహదేవ్‌ మనుషులు సునీల్‌వర్మ కోసం వెతుకుతూ బంగార్రాజు వెంటపడతారు. ఈ విషయాలన్నీ బంగార్రాజుని కన్‌ఫ్యూజ్‌ చేస్తాయి. బంగార్రాజు కన్‌ఫ్యూజన్‌లో వుండగానే సునీల్‌వర్మ చేసే ఇల్లీగల్‌ పనుల కోసం తనని వాడుకుంటున్నాడని అతనికి అర్థమవుతుంది. బంగార్రాజుని సునీల్‌వర్మ ఏ విషయంలో వాడుకున్నాడు? అసలు సునీల్‌వర్మ ఎవరు? మహదేవ్‌... సునీల్‌వర్మ కోసం ఎందుకు వెతుకుతుంటాడు? చివరికి బంగార్రాజు... సునీల్‌వర్మ, మహదేవ్‌ల నుంచి ఎలా తప్పించుకున్నాడు? వారి ఆట ఎలా కట్టించగలిగాడు? అనేది మిగతా కథ. 

బంగార్రాజుగా సునీల్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌ కాస్త డిఫరెంట్‌గానే వుందని చెప్పాలి. డాన్సుల్లో, ఫైట్స్‌లో అతని కష్టం కనిపిస్తుంది. కోపం అంటే ఏమిటో తెలియని బంగార్రాజుకి ఓ సందర్భంలో కోపం వస్తుంది. ఆ కోపంలో విలన్‌ గ్యాంగ్‌ని ఉతికే ఫైట్‌ని చాలా ఎమోషనల్‌గా చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా కూడా సునీల్‌కి కొన్ని మార్కులు పడతాయి. హీరోయిన్లు సుష్మారాజ్‌, రిచా పనయ్‌ కొన్ని సీన్ల కోసం, పాటల కోసం తప్ప వారి క్యారెక్టర్లకు ప్రాధాన్యత లేదు. మహదేవ్‌గా పునీత్‌ ఇస్సార్‌ నటన బాగుంది. పృథ్వీ, షకలక శంకర్‌, వెన్నెల కిషోర్‌ చేసిన కామెడీ బాగుంది. సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్పే డైలాగ్స్‌ నవ్వు తెప్పిస్తాయి. జయసుధ, నరేష్‌, అరవింద్‌, పోసాని వారి క్యారెక్టర్ల పరిధి మేరకు ఓకే అనిపించారు. 

టెక్నికల్‌గా చూస్తే దేవ్‌రాజ్‌ ఫోటోగ్రఫీ ఏవరేజ్‌గా వుంది. పాటల చిత్రీకరణ కూడా అంతంత మాత్రంగానే వుంది. సాగర్‌ మహతి చేసిన పాటలు మణిశర్మ చేసిన కొన్ని పాత పాటల్లా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగానే చేశాడు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ నాసిరకంగా వున్నాయి. కొన్ని సీన్స్‌ మరీ పేలవంగా, మిక్సింగ్‌ కూడా సరిగ్గా చెయ్యనట్టుగా అనిపిస్తాయి. డైరెక్టర్‌ వీరూ పోట్ల గురించి చెప్పాలంటే కథ, కథనాల కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ చేశాడనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు చాలా సీన్స్‌లో కామెడీ పండింది. అతను రాసిన డైలాగ్స్‌కి నవ్వులు వినిపిస్తాయి. ముఖ్యంగా పృథ్వీ, షకలక శంకర్‌, వెన్నెల కిషోర్‌ చెప్పిన డైలాగ్స్‌ మంచి ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. మందకొడిగా నడుస్తూ మధ్య మధ్యలో కామెడీతో ఫస్ట్‌ హాఫ్‌ ఏవరేజ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి కథలో కాస్త స్పీడ్‌ పెరగడం, కామెడీ కూడా తోడవడంతో ఫర్వాలేదు అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్‌ చేసుకొని రూపొందిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్‌ మినహా బలమైన కథ, కథనాలు లేకపోవడంతో ఇది ఓ ఏవరేజ్‌ సినిమాగా మిగిలిపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఈడు ఏవరేజ్‌ ఎహే 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Latest

Note: Please DO NOT use ABUSIVE language in comments.

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017