Advertisement

సినీజోష్‌ రివ్యూ: చుట్టాలబ్బాయి

Sat 20th Aug 2016 12:04 PM
telugu movie chuttalabbayi,aadi new movie chuttalabbayi,chuttalabbayi movie review,chuttalabbayi review in cinejosh,chuttalabbayi cinejosh review,veerabhadram new movie chuttalabbayi  సినీజోష్‌ రివ్యూ: చుట్టాలబ్బాయి
సినీజోష్‌ రివ్యూ: చుట్టాలబ్బాయి
Advertisement

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్‌ 

చుట్టాలబ్బాయి 

తారాగణం: ఆది, నమిత ప్రమోద్‌, సాయికుమార్‌, పోసాని, 

పృథ్వీ, ఆలీ, రఘుబాబు, అభిమన్యు సింగ్‌, షకలక శంకర్‌, 

కృష్ణ భగవాన్‌, గిరిధర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌ 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ 

మాటలు: భవాని ప్రసాద్‌ 

నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి 

రచన, దర్శకత్వం: వీరభద్రమ్‌ 

విడుదల తేదీ: 19.08.2016 

ప్రేమకావాలి, లవ్‌లీ తర్వాత సరైన హిట్‌ లేని ఆది.. అహనా పెళ్ళంట, పూలరంగడు వంటి హిట్‌ సినిమాల తర్వాత నాగార్జునతో భాయ్‌ వంటి డిజాస్టర్‌ చేసిన వీరభద్రమ్‌... చాలా ఫ్లాప్‌ల తర్వాత ఓ సూపర్‌హిట్‌ కొట్టాలని ఆది, భాయ్‌తో కొంత కాలం గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చిన వీరభద్రమ్‌ కలిసి ష్యూర్‌గా హిట్‌ కొట్టాలని చేసిన ప్రయత్నమే చుట్టాలబ్బాయి. కొత్త నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రంలో సాయికుమార్‌ ఓ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆదికి, వీరభద్రమ్‌కి ఎక్స్‌పెక్ట్‌ చేసిన సూపర్‌హిట్‌ని ఇచ్చిందా? చుట్టాలబ్బాయిగా ఆది ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈమధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో కథ కంటే హీరోయిజానికి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పృథ్వీలాంటి ఆర్టిస్టులపై ఆధార పడుతున్నారు. కామెడీ అంటే ఎంత ఇష్టపడేవారికైనా రొటీన్‌ అయిపోతే ఎంజాయ్‌ చెయ్యలేరు. ఇప్పుడొస్తున్న సినిమాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అలాగే వుంది. చుట్టాలబ్బాయి విషయానికి ఇందులో కథ అనేది ఇసుమంతైనా లేదు. అస్సలు కథ లేకుండా సినిమా తియ్యడం అనేది మన డైరెక్టర్లకే సాధ్యం అని వీరభద్రమ్‌ మరోసారి ప్రూవ్‌ చేశాడు. ఈ సినిమాలోని క్యారెక్టర్ల గురించి చెప్పాలంటే బాబ్జీ(ఆది) ఓ బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌. ఇఎంఐలు కట్టని వారి నుంచి తన తెలివితేటలతో డబ్బు కట్టించుకోవడం అనేది అతని స్కిల్‌. హీరోయిన్‌ కావ్య(నమిత ప్రమోద్‌) సిటీలోని ఎసిపి(అభిమన్యు సింగ్‌) చెల్లెలు. కారణం ఏమిటో తెలీదుగానీ ఆమెకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేయడం, ఆమె గోడ దూకి పారిపోవడం, మళ్ళీ పోలీసులతో వెతికించి ఇంటికి రప్పించడం.. ఇదీ ఆ అన్నయ్య పని. పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోవడానికి సరైన కారణం ఏదీ వుండదు. అలా ఓ సందర్భంలో బాబ్జీ కంట పడుతుంది కావ్య. వీళ్ళిద్దరూ కలిసి వుండడం చూసిన ఎసిపి... బాబ్జీని చంపాలని ట్రై చేస్తుంటాడు. ఓరోజు యధావిధిగా పెళ్ళిచూపులు తప్పించుకొని పారిపోతున్న కావ్యను కలుసుకుంటాడు. ఇద్దరూ కలిసి పారిపోతున్నారని భావించిన ఎసిపి వారిని వెతకమని పోలీసుల్ని పంపిస్తాడు. మరో పక్క కావ్య కోసం విలన్‌ గ్యాంగ్‌ సెర్చ్‌ చేస్తుంటుంది. ఓ ఊళ్ళో విలన్‌ గ్యాంగ్‌కి వీళ్ళిద్దరూ దొరుకుతారు. అదే టైమ్‌లో ఓ పది, పదిహేను కార్లలో వచ్చిన దొరబాబు(సాయికుమార్‌) వాళ్ళని రక్షించి ఇంటికి తీసుకెళ్తాడు. బాబ్జీని చూసిన ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు. అసలు దొరబాబు ఎవరు? దొరబాబుకి, బాబ్జీకి ఏమిటి సంబంధం? విలన్‌ గ్యాంగ్‌ కావ్య కోసం ఎందుకు వెతుకుతున్నారు? బాబ్జీ పల్లెటూరు నుంచి సిటీకి ఎందుకు వచ్చాడు? పెళ్ళిచూపులంటేనే ఇష్టం లేని కావ్య.. బాబ్జీని ప్రేమించిందా? అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. 

బీ టెక్‌ చదివిన బాబ్జీని పొలంలో మందు కొట్టడానికి, ట్రాక్టర్‌ నడపడానికి, పశువులకు మేత వేయడానికి వినియోగించుకునే తండ్రి. బాబ్జీ తోటివారంతా ఫారిన్‌లో సెటిల్‌ అయితే బాబ్జీని మాత్రం సిటీ వెళ్ళనివ్వడు తండ్రి. ఇది వినడానికి చాలా విడ్డూరంగా వున్నా సినిమా కాబట్టి విని ఊరుకోక తప్పదు. ఇంట్లో నుంచి పారిపోవడమే పనిగా పెట్టుకున్న కావ్య.. ఎందుకలా చేస్తుందే ఎవరికీ అర్థం కాదు. పెళ్ళి చేసుకోకుండా ఆమె సాధించాలనుకుంటున్నదేమిటో కూడా తెలీదు. ఇంజనీరింగ్‌ చదువుకున్న కొడుకుని ఇంటికి, పొలానికి మాత్రమే పరిమితం చెయ్యాలనుకున్న ఆ తండ్రి ఆంతర్యం ఏమిటో కూడా బోధపడదు. పారిపోయిన చెల్లెల్ని యుద్ధ ప్రాతిపదికలో పోలీసుల్ని పెట్టి వెతికించే ఎసిపి ఆరాటం ఏమిటో ఎంత ఆలోచించినా సమాధానం దొరకదు. ఇలా రకరకాల క్యారెక్టరైజేషన్స్‌తో, సినిమా నిడివిని పెంచే సీన్స్‌తో వీరభద్రమ్‌ చేసిన ఈ సినిమాలో అన్నీ ఆర్భాటాలే తప్ప అందర్నీ ఆకట్టుకునే అంశాలు మాత్రం శూన్యం. 

గత చిత్రాలతో పోలిస్తే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆది బెటర్‌గానే కనిపించాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎంతో ఈజ్‌ కనిపించింది. హీరోయిన్‌ నమిత ప్రమోద్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. గ్లామర్‌ పరంగా కూడా అందర్నీ ఆకట్టుకుంది. స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసిన సాయికుమార్‌ సినిమాకి కొంత వరకు ప్లస్‌ అయ్యాడు. దొరబాబుగా అతని పెర్‌ఫార్మెన్స్‌ డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. ఇగోరెడ్డిగా పృథ్వీ వీలైనంతలో ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా అతను చెప్పిన కొన్ని డైలాగ్స్‌కి థియేటర్‌లో క్లాప్స్‌ పడ్డాయి. మిగతా క్యారెక్టర్లలో పోసాని, రఘుబాబు, ఆలీ, షకలక శంకర్‌ తదితరులు ఓకే అనిపించారు. 

అరుణ్‌కుమార్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి కొంతవరకు ప్లస్‌ అయిందని చెప్పొచ్చు. ఫారిన్‌లో తీసిన సాంగ్‌, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ని అందంగా చూపించడంలో అరుణ్‌కుమార్‌ సక్సెస్‌ అయ్యాడు. థమన్‌ చేసిన పాటల్లో మూడు పాటలు బాగున్నాయనిపిస్తుంది. విజువల్‌గా కూడా ఈ పాటలు బాగానే వున్నాయి. థమన్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. భవాని ప్రసాద్‌ రాసిన మాటలు కొంతవరకు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాయి. డైరెక్టర్‌ వీరభద్రమ్‌ విషయానికి వస్తే సినిమాలో ఒక సెంట్రల్‌ పాయింట్‌ అనేది లేకుండా ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. సీన్‌ తర్వాత సీన్‌ అన్నట్టుగా సినిమా నడుస్తూ వుంటుందే తప్ప కథగానీ, ఒక ఫ్లో గానీ కనిపించదు. రెండున్నర గంటల సేపు సినిమాని నడిపించేందుకు రకరకాల సీన్స్‌తో కాలయాపన చేయడంలో వీరభద్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ బాగానే వున్నా సరైన కథ, కథనాలు లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. అసలు చుట్టాలబ్బాయి అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌ ఏమిటో సినిమా ఎండ్‌ అయిన తర్వాత కూడా మనకు అర్థం కాదు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు చూసిన సీన్సే మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో ఎప్పుడు ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అవుతుంది, సినిమా ఎప్పుడు క్లైమాక్స్‌కి వస్తుంది అని ఆడియన్స్‌ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. మేకింగ్‌ విషయానికి వస్తే సినిమా క్వాలిటీగా రావడం కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమాని నిర్మించారు. ఫైనల్‌గా చెప్పాలంటే సరైన కథ లేకపోవడం, కేవలం కామెడీతోనే సినిమాని రన్‌ చెయ్యాలనుకోవడం, అవసరానికి మించిన ఆర్భాటం చెయ్యడం, హీరోయిజానికి ఎక్కువ ఎలివేట్‌ చెయ్యాలనుకోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారడంతో చుట్టాలబ్బాయి ఒక సాదా సీదా సినిమాగా మిగిలిపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: విషయం లేని చుట్టాలబ్బాయి 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement