Advertisement

సినీజోష్‌ రివ్యూ: తను నేను

Sat 28th Nov 2015 01:45 PM
telugu movie thanu nenu,thanu nenu movie review,thanu nenu cinejosh review,avika gor new movie thanu nenu,thanu nenu director rammohan,thanu nenu hero santosh shobhan  సినీజోష్‌ రివ్యూ: తను నేను
సినీజోష్‌ రివ్యూ: తను నేను
Advertisement

సన్‌షైన్‌ సినిమాస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ 

తను నేను 

తారాగణం: సంతోష్‌ శోభన్‌, అవికా గోర్‌, రవిబాబు, 

అభిషేక్‌, సత్యకృష్ణన్‌, కిరీటి, రోహిత్‌ వర్మ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., 

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సాయి సుకుమార్‌, రామ్మోహన్‌ పి. 

సమర్పణ: డి.సురేష్‌బాబు 

నిర్మాత, దర్శకత్వం: రామ్మోహన్‌ పి. 

విడుదల తేదీ: 27.11.2015 

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని నిర్మించి తనకంటూ ఓ ప్రత్యేక అభిరుచి వుందని నిరూపించుకున్న నిర్మాత రామ్మోహన్‌ పి. ఆ చిత్రాలకు నిర్మాతగానే కాకుండా స్క్రిప్ట్‌పరంగా ఎన్నో ఇన్‌పుట్స్‌ ఇచ్చి ఆ సినిమాలు సూపర్‌హిట్‌ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన రామ్మోహన్‌ తను నేను చిత్రంతో దర్శకుడుగా మారాడు. వర్షం వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగులో తొలి హిట్‌ని అందుకున్న అవికా గోర్‌ హీరోయిన్‌గా రామ్మోహన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన తను నేను ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను నిర్మిస్తూ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న రామ్మోహన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంతోష్‌ శోభన్‌కు తను నేను గుడ్‌ ఎంట్రీ అయిందా? ఈ చిత్రానికి అవిగా గోర్‌ ఎంతవరకు ప్లస్‌ అయింది? సన్‌షైన్‌ సినిమాస్‌ బేనర్‌లో వచ్చిన గత చిత్రాల స్థాయిలో తను నేను చిత్రాన్ని రూపొందించడంలో రామ్మోహన్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని జీవితానికి వున్న ఒకే ఒక కల అమెరికా వెళ్ళడం. తన బంధువుల్లో ఎక్కువ శాతం అమెరికాలో వుండడం వల్ల తను కూడా అమెరికా వెళ్ళాలనుకుంటాడు. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోతాడు. తన కొడుకునైనా అక్కడికి పంపించి తన కోరిక తీర్చుకుందామనుకుంటాడు. కానీ, అదీ కుదరదు. చివరికి తన కూతురి మీదే ఆశలు పెట్టుకుంటాడు. తను పెద్దయిన తర్వాత అమెరికా వెళ్ళి తండ్రి పేరుని నిలబెడతానని దేవుడి దగ్గర కూతురితో ప్రమాణం చేయిస్తాడు తండ్రి. ఆ తండ్రి పేరు సర్వేశ్వరరావు బండ్రెడ్డి(రవిబాబు), ఆ ముద్దుల కూతురు కీర్తి(అవికా గోర్‌). చిన్నతనం నుండి తండ్రి నూరిపోసిన మంత్రాన్నే పెద్దయ్యాక కూడా పఠిస్తుంటుంది కీర్తి. ఆమె లక్ష్యం ఒక్కటే అమెరికా వెళ్ళాలి, నాన్నకి పేరు తేవాలి. మరో పక్క అమెరికా పేరు విన్నా, తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళి సెటిల్‌ అయ్యే కొడుకులు, కూతుళ్ళు అన్నా అసహ్యించుకునే క్యారెక్టర్‌ కిరణ్‌(సంతోష్‌ శోభన్‌)ది. అలా అతను అసహ్యించుకోవడానికి కూడా ఓ రీజన్‌ వుంది. చిన్నతనంలోనే అతన్ని అమ్మమ్మ దగ్గర వదిలేసి అమెరికా వెళ్ళిపోతారు అతని తల్లిదండ్రులు. ఇలా రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన కిరణ్‌, కీర్తి ప్రేమలో పడతారు. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కీర్తి అమెరికా వెళ్ళి తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక తన లవర్‌కి ఇష్టంలేని అమెరికాకి వెళ్ళకూడదని డిసైడ్‌ అవుతుందా? తన లక్ష్యానికి, తన కూతురికి మధ్యలో వచ్చిన కిరణ్‌ని చూసి కీర్తి తండ్రి ఎలా రియాక్ట్‌ అయ్యాడు? కీర్తి అమెరికా వెళ్ళకుండా వుండేందుకు కిరణ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి కిరణ్‌, కీర్తిల ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? అనేది మిగతా కథ. ఒక కథగా చెప్పుకోవడానికి ఇది అంత బలమైన కథ కాకపోయినా దీన్ని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ కామెడీని మిక్స్‌ చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. ఆ ప్రాసెస్‌లో కొన్ని అసహజమైన సన్నివేశాలు కూడా కథలో చోటు చేసుకున్నాయి. 

కిరణ్‌గా సంతోష్‌ శోభన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగలిగాడు. గతంలో ఒక సినిమా అనుభవం వున్నప్పటికీ హీరోగా అందర్నీ మెప్పించాడనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్‌లోగానీ, డైలాగ్‌ డెలివరీలోగానీ చాలా ఈజ్‌ కనిపించింది. అయితే చాలా సీన్స్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌లో నాని, మహేష్‌, అవసరాల శ్రీనివాస్‌..ఇలా చాలా మంది హీరోలు గుర్తొస్తారు. అలా కాకుండా తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్‌ చేసుకోగలిగితే నటుడిగా మరింత రాణిస్తాడు సంతోష్‌. ఇక హీరోయిన్‌ అవికా గోర్‌ గురించి చెప్పాల్సి వస్తే ఆమె ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్‌స్టోరీ అయినప్పటికీ ఎక్కువ హీరో చుట్టూనే కథ తిరుగుతుంటుంది. బండ్రెడ్డి సర్వేశ్వరరావుగా రవిబాబు పెర్‌ఫార్మెన్స్‌గానీ, అతని లుక్‌గానీ కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ క్యారెక్టర్‌ గురించి ప్రమోషన్‌లో బిల్డప్‌ చేసినంతగా సినిమాలో కనిపించదు. మిగతా క్యారెక్టర్స్‌లో హీరోయిన్‌ తల్లిగా సత్యకృష్ణన్‌, హీరో ఫ్రెండ్‌ నరేష్‌గా అభిషేక్‌, ఎన్నారైగా రోహిత్‌ వర్మ ఫర్వాలేదనిపిస్తారు. 

ఈ సినిమాకి టెక్నికల్‌గా సినిమాటోగ్రాఫర్‌ సురేష్‌ సారంగం, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సన్ని చాలా ప్లస్‌ అయ్యారు. లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే విజువల్‌గా ప్రతి సీన్‌ని చాలా నీట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు సురేష్‌. సన్నీ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బాగా కుదిరింది. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కథ, కథనాల గురించి చెప్పుకోవాలంటే అమెరికాకి వెళ్ళాలన్న ఒక తండ్రి యాంబిషన్‌ని నిజం చేసే ప్రాసెస్‌లో హీరోయిన్‌ లవ్‌లో పడడం, అమెరికా వెళ్ళాలన ఆలోచనను విరమించుకోవడం అనే కథలో కొత్తదనం ఏమీ కనిపించకపోయినా దాని చుట్టూ అల్లిన కథ, కొన్ని కామెడీ సీన్స్‌తో సినిమాని నడిపించేసి హ్యాపీ ఎండింగ్‌ ఇచ్చెయ్యాలన్న కథారచయిత సాయిసుకుమార్‌, అతనికి సహకరించిన రామ్మోహన్‌ల ప్రయత్నం కొంత వరకు సక్సెస్‌ అయ్యిందని చెప్పాలి. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో వున్న గ్రిప్‌ సెకండాఫ్‌లో కనిపించదు. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో కథ కంప్లీట్‌ అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్‌ వరకు సినిమాని లాగినట్టు అనిపిస్తుంది. వీటన్నింటినీ మించి స్లో నేరేషన్‌ వల్ల కూడా కథ ముందుకు వెళ్తున్నట్టు వుండదు. 

ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తను నేను రూపొందిందని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎక్కడా అసహనాన్ని కలిగించే సీన్స్‌గానీ, వల్గర్‌ డైలాగ్స్‌గానీ, సీన్స్‌గానీ వుండవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కథానుసారం ఈ చిత్రంలో కేవలం రెండుసార్లు మాత్రమే హీరో మందు కొట్టే సీన్స్‌ చూపించారు. అదీ కొద్దిసేపే. ఇక సిగరెట్‌ విషయానికి వస్తే ఒక్క సీన్‌లో కూడా మనకు సిగరెట్‌ కనిపించదు. ఈమధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో అవసరం వున్నా లేకపోయినా సిగరెట్‌, ఆల్కాహాల్‌ సీన్స్‌ లెక్కకు మించి వుంటున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న రామ్మోహన్‌ని అభినందించాల్సిందే. 

క్యారెక్టర్ల ఇంట్రడక్షన్‌తో హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌తో, కొన్ని కామెడీ సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అవుతుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి కథని ఓ కొలిక్కి తీసుకు రాకుండా కాలయాపన చేయడం మనకు తెలుస్తుంది. హీరో తను అనాధ అని హీరోయిన్‌కి చెప్పడం, ఆ తర్వాత అతన్ని ఇండియాలో వదిలేసి అమెరికాలో సెటిల్‌ అయిన తల్లిదండ్రుల గురించి చెప్పే సీన్‌ ఆడియన్స్‌ని సెంటిమెంటల్‌గా టచ్‌ చేస్తుంది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఆకట్టుకునేలా తియ్యడంలో డైరెక్టర్‌ రామ్మోహన్‌ సక్సెస్‌ అయ్యాడు. హీరో, హీరోయిన్‌ల పెర్‌ఫార్మెన్స్‌, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, యూత్‌ని ఆకట్టుకునే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో కొన్ని మైనస్‌లు వున్నా, స్లో నేరేషన్‌ అనిపించినా ఈమధ్యకాలంలో ఇలాంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రాలేదనే చెప్పాలి. కుటుంబ సమేతంగా అందరూ ఒకసారి హ్యాపీగా చూడదగిన సినిమా తను నేను. 

ఫినిషింగ్‌ టచ్‌: క్లీన్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement