Advertisement

సినీజోష్‌ రివ్యూ: అఖిల్‌

Thu 12th Nov 2015 12:12 PM
telugu movie akhil,akkineni akhil movie akhil,akhil movie review,akhil movie cinejosh review,akhil movie telugu review in cinejosh,akhil and vinayak combo movie akhil  సినీజోష్‌ రివ్యూ: అఖిల్‌
సినీజోష్‌ రివ్యూ: అఖిల్‌
Advertisement

శ్రేష్ఠ్‌ మూవీస్‌ 

అఖిల్‌ 

తారాగణం: అక్కినేని అఖిల్‌, సయేషా సైగల్‌, 

రాజేంద్రప్రసాద్‌, మహేష్‌ మంజ్రేకర్‌, బ్రహ్మానందం, 

వెన్నెల కిషోర్‌, జె.పి. తదితరులు 

సినిమాటోగ్రఫీ: అమోల్‌ రాథోడ్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: మణిశర్మ 

కథ: వెలిగొండ శ్రీనివాస్‌ 

మాటలు: కోన వెంకట్‌ 

సమర్పణ: నిఖితారెడ్డి 

నిర్మాత: నితిన్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌ 

విడుదల తేదీ: 11.11.2015 

నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన నటవారసుడిగా అక్కినేని నాగార్జున నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. నాగార్జున తర్వాత అక్కినేని వంశం నుంచి సుమంత్‌, నాగచైతన్య, సుశాంత్‌ వంటి హీరోలు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ యంగ్‌ హీరోలందరి కంటే ముందే బాలనటుడుగా అక్కినేని అఖిల్‌ సిసింద్రీ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఆమధ్య మనం చిత్రం క్లైమాక్స్‌లో ఒక సీన్‌లో కనిపించాడు. ఇప్పుడు అఖిల్‌ చిత్రంతో హీరోగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హీరో నితిన్‌ నిర్మించిన అఖిల్‌ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని ఫ్యామిలీలో, అక్కినేని వంశాభిమానుల్లో అఖిల్‌ చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అఖిల్‌ ఎంతవరకు రీచ్‌ అయ్యాడు? డైరెక్టర్‌ వినాయక్‌ అఖిల్‌కి మెమరబుల్‌ ఎంట్రీ ఇవ్వగలిగాడా? హీరోగా అఖిల్‌ ఎంతవరకు ఆడియన్స్‌ని, అభిమానుల్ని అలరించగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సాధారణంగా ఒక స్టార్‌ హీరో తన తనయుడ్ని హీరోగా పరిచయం చెయ్యాలంటే ఒక లవ్‌స్టోరీనో, రొటీన్‌కి భిన్నంగా వుండే సబ్జెక్ట్‌నో సెలెక్ట్‌ చేసుకుంటారు. కానీ, అఖిల్‌ హీరోగా నటించే తొలి చిత్రానికి మాత్రం యాక్షన్‌ సబ్జెక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం డాన్సులు, ఫైట్స్‌ మీద ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు. అఖిల్‌ డాన్సులు, ఫైట్స్‌ ఇరగదీశాడు అని చెప్పించుకునే ప్రయత్నం సినిమాలో కనిపిస్తుంది. 

కథ విషయానికి వస్తే అగ్నిగోళమైన సూర్యుడి శకలాల నుంచి తయారైన భూమి మళ్ళీ అదే సూర్యుని తాపానికి అగ్నిగోళంగా మారుతుందని ఇప్పుడు శ్రాస్తవేత్తలు చెప్తున్నారు. ఇదే విషయాన్ని మన మహర్షులు గుర్తించి, ఈ ఉపద్రవం నుంచి భూమిని కాపాడటానికి ఎన్నో ప్రయోగాలు చేసి భూమ్మీద వున్న లోహాలను, ఖనిజాలను వాడి సూర్య తాపాన్ని నిలువరించే అత్యంత శక్తివంతమైన సూర్య కవచాన్ని తయారు చేశారు. దీన్ని భూమధ్య రేఖపై ప్రతిష్ఠించాలి కనుక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖకు చేరుకొని అక్కడ నివసిస్తున్న ఓజో అనే ఆటవిక తెగవారికి ఆ సూర్య కవచాన్ని అప్పగించి.. ప్రతి సూర్య గ్రహణం అనంతరం వెలువడే తొలి సూర్య కిరణాలను ఇక నుంచి ఖచ్చితంగా సూర్య కవచంపై పడాలని, ఏ ఒక్క సూర్య గ్రహణానికి అలా జరక్కపోయినా భూమికి జరిగే విపత్తు చాలా దారుణంగా వుంటుందని ఆ తెగవారికి తెలియజేశారు మహర్షులు. అప్పటి నుంచి ఆ తెగవారు దానిని జువా అనే దైవంగా భావించి కాపాడుకుంటూ వస్తున్నారు. మన శాస్త్రాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ రష్యన్‌ జనరల్‌ ఖత్రోచి(టామ్‌ ఆల్టర్‌) కన్ను జువాపై పడింది. దాన్ని ఎలాగైనా కాజేసి భూమ్మీద విధ్వంసం మొదలవగానే సొల్యూషన్‌ తన దగ్గరే వుంచుకొని అన్ని దేశాలమీద అధికారం చెలాయించాలని ఆశపడ్డాడు. జువాను తీసుకొచ్చే బాధ్యతను ముఖేష్‌(మహేష్‌ మంజ్రేకర్‌), మాంబోలకు అప్పగించాడు. మాంబో తన బలగంతో ఓజో తెగపై దాడిచేస్తాడు. అదే టైమ్‌లో ఆ తెగలోని బోడోకి జువాను అప్పగించి దాన్ని కాపాడాలని, మళ్ళీ సూర్యగ్రహణం టైమ్‌కి ఇక్కడికి తీసుకురావాలని చెప్తారు తెగవారు. జువాతో సహా అక్కడి నుంచి తప్పించుకుంటాడు బోడో. కట్‌ చేస్తే హైదరాబాద్‌లో అఖిల్‌(అఖిల్‌) అనే అనాథ కథ స్టార్ట్‌ అవుతుంది. స్ట్రీట్‌ ఫైట్స్‌ చేస్తూ, బెట్స్‌ కాస్తూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే అఖిల్‌కు కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో దివ్య(సయేషా) అనే అమ్మాయి పరిచయమవుతుంది. జువా కోసం వెతుకుతున్న ముఖేష్‌ కూతురే దివ్య. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు అఖిల్‌. ఆమెకు నందకిషోర్‌(వెన్నెల కిషోర్‌)తో పెళ్ళి అని తెలుసుకొని ఒక ప్లాన్‌ ప్రకారం ఆ పెళ్ళిని చెడగొడతాడు. దాంతో దివ్య యూరప్‌ వెళ్ళిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ అఖిల్‌ కూడా యూరప్‌ వెళ్తాడు. యూరప్‌ వెళ్ళిన అఖిల్‌ ఆమె ప్రేమను పొందడానికి ఏం చేశాడు? ఖత్రోచి జువాను దక్కించుకోగలిగాడా? జువాకి సంబంధించిన కథ అఖిల్‌కి ఏ విధంగా లింక్‌ అయింది? జువా కోసం కథ ఎన్ని మలుపులు తిరిగింది, చివరికి ఎలా ఎండ్‌ అయింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

జువా విశిష్టత, దాని వల్ల భూమికి జరిగే మేలు గురించి వాయిస్‌ ఓవర్‌లో తెలుసుకుంటాం. కట్‌ చేస్తే ఒక అర్థంలేని లవ్‌స్టోరీతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా రన్‌ అవుతూ వుంటుంది. తలా తోక లేని ఈ లవ్‌స్టోరీలో హీరో, హీరోయిన్‌, మిగతా ఆర్టిస్టులందరూ చాలా ఆర్టిఫిషియల్‌గా పెర్‌ఫార్మ్‌ చేస్తూ లవ్‌స్టోరీ అంటే ఇలా వుంటుందా అనిపిస్తారు. అన్ని సినిమాల్లోగానే ఈ సినిమాలో కూడా హీరో తొలిచూపులోనే హీరోయిన్‌ని లవ్‌ చేస్తాడు, ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడతాడు. కానీ, సినిమా మొత్తంలో ఒక్క సీన్‌లో కూడా ఈ ప్రేమ జంట మధ్య సరైన కెమెస్ట్రీగానీ, ఆహా అనిపించే రొమాంటిక్‌ సీన్‌ గానీ మనకు కనిపించదు. దీన్ని ఎలాంటి లవ్‌ అంటారో అర్థం కానీ విధంగా వారి ప్రేమ సాగుతుంటుంది. హీరోయిన్‌ కోసం హీరో ఎంతో తాపత్రయపడుతుంటాడు కానీ, హీరోయిన్‌ మాత్రం ఏ సందర్భంలోనూ అతనిపై ప్రేమ కురిపించదు. వీరి కథ ఒక దారికి వచ్చే టైమ్‌కి మళ్ళీ జువా కథ మొదలవుతుంది. చివరికి మన హీరోయే ఆ జువాని తీసుకొచ్చి దాన్ని యధా స్థానంలో వుంచుతాడు. 

సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టర్‌ కూడా మనకు నేచురల్‌గా అనిపించదు. దానికి తగ్గట్టుగానే వారి పెర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా అసహజంగా వుంటూ మనల్ని అసహనానికి గురి చేస్తుంది. వినాయక్‌ సినిమాల్లో వుండే పవర్‌ఫుల్‌ సీన్స్‌గానీ, కామెడీ సీన్స్‌గానీ ఈ సినిమాలో లేవు. బ్రహ్మానందం, సప్తగిరి, వెన్నెలకిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి వంటి ఆర్టిస్టులు నవ్వించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, ఫలితం శూన్యం. హీరో అఖిల్‌ని కేవలం డాన్సులకు, ఫైట్స్‌కి మాత్రమే పరిమితం చేశారనిపిస్తుంది. నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఒక్క సీన్‌లో కూడా ఇవ్వలేదు. దాని కోసం అఖిల్‌ కూడా ప్రయత్నించలేదు. కాకపోతే ఇప్పటివరకు అక్కినేని వంశంలో డాన్సులు, ఫైట్స్‌ ఇరగదీసేవాడు ఒకడొచ్చాడని మాత్రం అభిమానులు గర్వంగా చెప్పుకోవచ్చు. సెట్‌లో తీసిన అఖిల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ పాటలో అఖిల్‌ వేసిన స్టెప్స్‌ మాత్రం బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ లో అక్కినేని నాగార్జున కనిపించడం, అఖిల్ తో కలిసి స్టెప్స్ వెయ్యడం అభిమానులకు అననందాన్ని కలిగించే విషయమే. హీరోయిన్‌ సయేషా చేసిన క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. తను యూరప్‌ వెళ్ళింది చదువుకోవడానికి కాదనీ, తన పెళ్ళిని చెడగొట్టిన వాడిని చంపడానికని చెప్పడం ఆమె క్యారెక్టరైజేషన్‌ ఎంత బలహీనంగా వుందో తెలియజేస్తుంది. 

టెక్నికల్‌గా చూసుకుంటే అమోల్‌ రాథోడ్‌ ఫోటోగ్రఫీ సూపర్బ్‌గా వుందని చెప్పాలి. అనూప్‌, థమన్‌ చేసిన పాటలు ఆడియోపరంగా అంతగా ఆకట్టుకునేలా లేవు. కానీ, విజువల్‌గా ఈ పాటల్ని చాలా రేర్‌ లొకేషన్స్‌లో తియ్యడం వల్ల రిచ్‌ లుక్‌ వచ్చింది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి చాలా వరకు హెల్ప్‌ అయింది. రవివర్మ కంపోజ్‌ చేసిన డిఫరెంట్‌ ఫైట్స్‌ కూడా ఫర్వాలేదు అనిపిస్తాయి. అఖిల్‌ ఎంతో కష్టపడి ఫైట్స్‌ని చేశాడని ఒప్పుకోవాలి. డమరుకం తర్వాత మళ్ళీ అలాంటి కథని ఇచ్చిన వెలిగొండ శ్రీనివాస్‌ ఈసారి కూడా ఆడియన్స్‌ని తన కథతో మెప్పించలేకపోయాడు. కోన వెంకట్‌ రాసిన మాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. చాలా సందర్భాల్లో ప్రాస కోసం ప్రాకులాడడం కనిపించింది. ఈ కథకు సరైన స్క్రీన్‌ప్లే సమకూర్చుకోవడంలో వినాయక్‌ సక్సెస్‌ అవ్వలేకపోయాడు. జువా అనే ఒక కొత్త పాయింట్‌ని సెలెక్ట్‌ చేసుకొని దానికి ఒక నాసిరకం ప్రేమకథను జోడించి, దాన్ని రకరకాల మలుపులు తిప్పి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడంలో మాత్రం వినాయక్‌ సక్సెస్‌ అయ్యాడు. 

జువా అనే ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో మొదలైన కథకి స్టార్టింగ్‌లోనే బ్రేక్‌ వేసి కొంత టైమ్‌ హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమకథ నడిపి, దానికి కొంత ఫ్యామిలీని కూడా యాడ్‌ చేసి ఫస్ట్‌ హాఫ్‌ ఎండింగ్‌లో జువాకి హీరోని కనెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. ఇక సెకండాఫ్‌లో జువా కోసం జరిగే సెర్చింగ్‌లో ఎన్నో మలుపులు, కొన్ని కామెడీ సీన్స్‌తో సినిమాని క్లైమాక్స్‌కి తీసుకొస్తాడు డైరెక్టర్‌. క్లైమాక్స్‌ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. కట్టె, కొట్టె, తెచ్చే టైపులో చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సినిమాలో ఎలాంటి సస్పెన్స్‌, థ్రిల్‌ లేకపోవడం, కథలో క్యూరియాసిటీ అనేది ఇసుమంత కూడా కనిపించకపోవడంతో ఒక సాదా సీదా సినిమా చూశామన్న ఫీలింగ్‌తో ఆడియన్స్‌ బయటికి వస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే అఖిల్‌ అనే సినిమా అక్కినేని అఖిల్‌కి కరెక్ట్‌ ఎంట్రీ కాదు. డాన్సులు, ఫైట్స్‌ ఇరగదీసినా అవి సినిమాకి ఏమాత్రం హెల్ప్‌ అవ్వలేదు. ఆర్టిస్టుగా తనను తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం రాలేదు. కేవలం అక్కినేని అభిమానులకు మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్‌ అయ్యే ఛాన్సెస్‌ చాలా తక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: మిస్‌ఫైర్‌ అయిన అఖిల్‌ ఎంట్రీ 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement