Advertisement

సినీజోష్‌ రివ్యూ: టామి(ది లవ్‌లీ డాగ్‌)

Fri 13th Mar 2015 03:27 PM
telugu movie tommy,dr.rajendra prasad,babu pictures,raja vannemreddy,chakri  సినీజోష్‌ రివ్యూ: టామి(ది లవ్‌లీ డాగ్‌)
సినీజోష్‌ రివ్యూ: టామి(ది లవ్‌లీ డాగ్‌)
Advertisement

బాబు పిక్చర్స్‌

టామి(ది లవ్‌లీ డాగ్‌)

నటీనటులు: డా॥ రాజేంద్రప్రసాద్‌, లవ్‌లీ డాగ్‌ భూగీ  సీత, ఎల్‌.బి.శ్రీరామ్‌, 

సురేష్‌, సూర్య తదితరులు

కెమెరా: మోహన్‌ చంద్‌

సంగీతం: చక్రి

పాటలు: అనంత శ్రీరామ్‌

రచన: పి.రాజేంద్రకుమార్‌

ఎడిటింగ్‌: నందమూరి హరి

సమర్పణ: డా॥ రాజేంద్రప్రసాద్‌

నిర్మాతలు: చేగొండి హరిబాబు, బోణం చినబాబు

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి

విడుదల తేదీ: 13.03.2015

నటకిరీటి డా॥ రాజేంద్రప్రసాద్‌ కామెడీని ఎంత బాగా పండిరచగలరో కొన్ని వందల సినిమాల్లో మనం చూశాం. ఆ తర్వాత కొన్ని మానవీయ విలువలున్న సినిమాలు, సందేశాత్మక చిత్రాల్లో సైతం తన నటనతో కంటతడి పెట్టించగల పాత్రలు చేసి తను కామెడీకి మాత్రమే పరిమితం కాదని నిరూపించారు. తాజాగా రాజేంద్రప్రసాద్‌ చేసిన ‘టామి’ కూడా ఆ కోవకు చెందిన సినిమాయే. భూగీ అనే కుక్క, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘టామి’. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో ఏనుగుతో కలిసి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రంలో నటించి కామెడీతోపాటు మంచి సెంటిమెంట్‌ను కూడా పండిరచిన రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో ఎలాంటి అనుభూతిని ప్రేక్షకులకు పంచారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: నరసాపురంలో వుండే విశ్వనాథ్‌(డా॥ రాజేంద్రప్రసాద్‌) అనే లెక్చరర్‌ ప్రతిరోజూ ఉదయం ట్రైన్‌లో భీమవరం వెళ్ళి తన విధులకు హాజరై తిరిగి సాయంత్రం 5 గంటలకు నరసాపురం వస్తుంటాడు. ఓరోజు రైల్వేస్టేషన్‌లో ఓ కుక్క(భూగీ) కంటపడతాడు విశ్వనాథ్‌. ఆ క్షణం నుంచి అతన్నే అంటి పెట్టుకొని వుంటుంది. దాని ప్రేమను చూసి ముగ్ధుడైన విశ్వం దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. దానికి టామి అని పేరు కూడా పెడతాడు. కుక్కలంటే ఇష్టపడని అతని భార్య(సీత) దాన్ని పెంచుకోవడానికి ఇష్టపడదు. కొన్నాళ్ళకు భర్తకు దానిపై వున్న ప్రేమను గ్రహించి తను కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటూ వుంటుంది. ప్రతిరోజూ విశ్వం వెంట రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది. తిరిగి అతను వచ్చే టైమ్‌కి స్టేషన్‌ బయట వెయిట్‌ చేస్తుంటుంది. ఇలా విశ్వం, టామిల అనుబంధం విడదీయరాని బంధంగా మారుతుంది.. ఆ సమయంలో ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏమిటి? దానివల్ల ఆ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: లవ్‌, యాక్షన్‌, కామెడీ, హార్రర్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఓ కుక్క ప్రధాన పాత్రలో సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలన్న సాహసం చేసిన నిర్మాతల్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమాకి మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌ అదే. కుక్కతోపాటు మరో ప్రధాన పాత్రలో రాజేంద్రప్రసాద్‌ని ఎంపిక చేసుకోవడం కూడా మరో ప్లస్‌ పాయింట్‌. విశ్వం పాత్రలో రాజేంద్రప్రసాద్‌ జీవించారని చెప్పాలి. నటనే అయినప్పటికీ సహజత్వం అనేది ఎక్కడా మిస్‌ అవకుండా నిజంగానే తనకు ఆ కుక్కతో అనుబంధం వుంది అనేంతగా పాత్రలో లీనమై నటించారు. టామిగా నటించిన భూగితో క్యారెక్టర్‌కి తగినట్టుగా దానితో యాక్ట్‌ చేయించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. సినిమాలోని మిగతా పాత్రలు అంత చెప్పుకోదగినవి కావు. అనంత శ్రీరామ్‌ పాటలు, చక్రి అందించిన సంగీతం కూడా ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్‌ సీన్స్‌లో చక్రి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందర్నీ బాధపెట్టింది. మోహన్‌చంద్‌ ఫోటోగ్రఫీ స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ చాలా రిచ్‌గా వుంది. 

మైనస్‌ పాయింట్స్‌: మంచి కథ, కుక్క ప్రధాన పాత్రలో రాజేంద్రప్రసాద్‌లాంటి మేటి నటుడు చేసిన సినిమా. పేలవమైన సన్నివేశాలతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. దానికి తగ్గట్టుగానే స్లో నేరేషన్‌తో కథ నత్త నడక నడుస్తూ ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదనిపించారు. సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే ఆ కుటుంబంలో జరిగిన సంఘటనతో కథ దాదాపు పూర్తవుతుంది. కానీ, దాన్ని సాగదీసి చూసిన సన్నివేశాలనే మళ్ళీ మళ్ళీ చూపించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించారు. మంచి కథ అయినప్పటికీ కథనంలో గ్రిప్‌ లేకపోవడంవల్ల ప్రతి సన్నివేశం తేలిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలు, కామెడీ సీన్స్‌తో కాలయాపన చేయడంతో ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్‌ కాలేరు. కేవలం కుక్క పెర్‌ఫార్మెన్స్‌ చూడడం కోసమే సీట్లలో అంటిపెట్టుకొని కూర్చుంటారు తప్ప కథ కోసం కాదు అనిపిస్తుంది. 

విశ్లేషణ: ‘టామి’ అనే సినిమా ఒక మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. ఓ యదార్థ సంఘటనకి తెరరూపం ఇచ్చే ప్రయత్నం చేసిన దర్శకనిర్మాతల్ని మెచ్చుకోవాలి. జంతు ప్రేమికులు ఇష్టపడే ఇలాంటి సినిమాలు కరవైన ఈరోజుల్లో ‘టామి’లాంటి సినిమా వస్తోందంటే ఎదురు చూసే ప్రేక్షకులు తప్పకుండా వుంటారు. ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త ఫర్వాలేదు అనిపించినా, సెకండాఫ్‌లో చాలా ల్యాగ్‌ వుండడం వల్ల అనుకున్న ఫీల్‌ రాలేదు. అయితే చివరి 20 నిముషాలు టామికి సంబంధించిన సీన్స్‌ చూస్తే అప్పటివరకు బోర్‌ ఫీల్‌ అయిన ఆడియన్స్‌ కూడా కంటతడి పెట్టక మానరు. కుక్కలను ప్రాణంగా చూసుకునేవారు, మూగ జీవాలంటే ఇష్టపడేవారు ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఫైనల్‌గా చెప్పాలంటే చాలా కాలం తర్వాత ఒక మూగజీవితో చేసిన ఈ సినిమాని ఏ మేర ప్రేక్షకులు ఆదరిస్తారు.. కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది సినిమాకి వచ్చే మౌత్‌ టాక్‌ని బట్టి వుంటుంది.

ఫినిషింగ్‌ టచ్‌: అభినందించ దగిన మంచి ప్రయత్నం

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement