Advertisement

జగన్‌ వ్యూహం ఎలా ఉండబోతుంది!

Mon 02nd May 2016 01:25 PM
jaganmohan reddy,ycp,andhra politics,special status,bjp,jagan  జగన్‌ వ్యూహం ఎలా ఉండబోతుంది!
జగన్‌ వ్యూహం ఎలా ఉండబోతుంది!
Advertisement

ప్రజలు తమకు ప్రతిపక్షపార్టీ హోదా కలిగించినప్పుడు తమకు అధికారం ఇవ్వలేదు కదా...!  అని మౌనంగా ఉండటం రాజకీయంగా సముచితం కాదు. ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పార్టీ చేసే అన్యాయాలను, అవినీతిని, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఉంటేనే తదుపరి ఎన్నికల్లో అయినా ఆ పార్టీకి పట్టం కడుతారు ఓటర్లు. అందుకే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎంతో ఓర్పు నేర్పు కావాలి. అధికారం లేదు కదా? అని ఉదాసీనంగా ఉంటే ఆ తదుపరి ఎన్నికల్లో ఆమాత్రం సీట్లు కూడా రావు. నిజానికి ఏపీలోని ప్రతిపక్షపార్టీ వైసీపీ ఇప్పటివరకు అధికార పక్షంపై సరైన పోరాటం చేయలేదు. ఎప్పుడు విశ్వసనీయత, నమ్మకం, అంటూ రాజశేఖర్‌రెడ్డి సింపతీని బయటకు తీసిందే కానీ ప్రజల పక్షాన నిలబడి ఒక్కటంటే ఒక్క మంచి పనిని కూడా వారు చేయలేకపోయారు. నిజానికి ఏపీలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ చేసిన పోరాటాలు ఏమీ లేవు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్‌కు, వైసీపీకి మంచి పాశుపతాస్త్రం లభించింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రజలు బీజెపీపై అలాగే కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని టిడిపిపై చాలా కోపంగా ఉన్నారు. ఈ సదవకాశాన్ని జగన్‌ ఎలా సద్వినియోగం చేసుకుంటే ఆయనకు అంత మైలేజ్‌ వస్తుందనేది అందరి అభిప్రాయం. ప్రస్తుతం టిడిపి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి విషయాలలో నిండా మునిగిపోతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ పార్టీ కేంద్రంపై ఎదురుతిరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అలాగే కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్‌లను కడుతోంది. దీనివల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఎంతో నష్టపోతాయి. కానీ ఈ విషయంలో చంద్రబాబు తెలంగాణ వైఖరిని తప్పుపట్టడం లేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాడు. మరోపక్క రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు టిడిపి తీసుకున్న చర్యలు ఏమీ కనిపించడం లేదు. తెలంగాణపై గట్టిగా ప్రశ్నిస్తే ఓటుకు నోటు విషయం మరలా తెరపైకి కేసీఆర్‌ తెస్తాడనే భయం బాబుకు ఉంది. మరోవైపు కేంద్రం కూడా వైసీపీ ఎమ్మేల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం, ఓటుకునోటు కేసులో, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంశం వంటి ఆయుధాలను తన పొదిలో దాచుకొని ఉంది. చంద్రబాబు తోకాడిస్తే వాటిని కేంద్రం బయటకు తీయడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కరువు, ఇతర అంశాలపై సోమవారం నుండి వైయస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది. మరోవైపు మే 16, 17,18 తేదీల్లో జగన్‌ ఈ అంశాలపై కర్నూల్‌లో దీక్ష చేయనున్నాడు. జగన్‌ ఓదార్పు యాత్రలు చేయడం, ధర్నాలు చేయడం వరకే పరిమితం అవుతున్నాడు కానీ అంత కంటే మంచి ఉద్యమాలను, ప్రజల్లోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలను ఆయన చేపట్టలేకపోతున్నాడు. మరి ఈసారి వచ్చిన అరుదైన అవకాశాన్ని ఆయన ఎంత మాత్రం ఉపయోగించుకుంటాడో వేచిచూడాల్సివుంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement